ఘట్కేసర్, నవంబర్ 28: ఘట్కేసర్లోని విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘విజ్ఞాన్స్ ఫ్యూచర్ ఎక్స్–2026’ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ఘనంగా ముగిసింది. నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. వీరబ్రహ్మం హాజరయ్యారు. అగ్ని-III క్షిపణి ప్రాజెక్టులో ఆయన చేసిన కృషి, బయోడీగ్రేడబుల్ బ్యాగులు, సైనికుల కోసం తక్షణ ఆహార పరిష్కారాల వంటి ఆవిష్కరణల్లో ఆయన సేవలను విద్యార్థులకు పరిచయం చేశారు. ఆయన సందేశం విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించింది.
విద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ వాటి పనితీరు, ఉపయోగాలను సందర్శకులకు వివరించారు. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించి ప్రశంసించారు.
ప్రాజెక్ట్ పోటీల్లో శ్రీ స్వామి నారాయణ స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించగా, రెండో, మూడో బహుమతులను విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. విజేతలను అభినందిస్తూ బహుమతులు అందజేశారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ విజయవంతంగా ముగిసింది.



