బాలుడి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సీతక్క ఆరా.. కుటుంబ సభ్యులకు ధైర్యం
మంగపేట, నవంబర్ 29 (ప్రజావాణి):
మండలంలోని పాలైగూడెం గ్రామానికి చెందిన పోతుమర్తి సందీప్ కుమారుడు రుద్రాన్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులతో కలిసి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. కమలాపురంలోని రోసా మిస్టికా కాన్వెంట్ హైస్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో స్కూల్ బస్సు దిగి తల్లితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక లారీ ఢీకొనడంతో బాలుడు గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు బాలుడి ఇంటికి వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.అనంతరం మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు ఫోన్ ద్వారా ప్రమాద వివరాలను తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి సీతక్క బాలుడి తండ్రి సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయ్యోరి యానయ్య, ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ సెల్ జిల్లా చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తోట రమేష్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యంపెల్లి వీరస్వామి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తుడి భగవాన్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బసారీకారి హరికృష్ణ, సీనియర్ నాయకులు కాటేబోయిన నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

