జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ఏ ఒక్క ప్రభుత్వం ఇచ్చిన కానుక కాదని, అది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జనగామ ప్రజలు చేసిన నిరంతర పోరాటాల ఫలితమని జనగామ జిల్లా జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు అన్నారు.
శనివారం సాయంత్రం బాణాపురంలోని ఒక కళాశాల ప్రాంగణంలో జనగామ జిల్లా జాక్ , సాదిక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “జనగామకు మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది?” అనే అంశంపై విద్యార్థులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగళంపల్లి రాజు మాట్లాడుతూ, 2018 నవంబర్ 23న ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, జనగామలో తప్పనిసరిగా ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీ అమలులో జాప్యం జరగడంతో విద్యార్థి సంఘాలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాయని తెలిపారు.
అనంతరం 2022 ఫిబ్రవరిలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జనగామకు మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ కూడా అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేశాయని వివరించారు.
విద్యార్థుల నిరసనలు, ప్రజా సంఘాల పోరాటాలు, జనగామ ప్రజల ఐక్య ఉద్యమాల ఫలితంగానే చివరకు జనగామ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరైందని రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలే ప్రధాన మార్గమని అన్నారు. జనగామకు మెడికల్ కాలేజ్ సాధన వెనుక జరిగిన ఉద్యమాలను ఎవరూ మరిచిపోకూడదని పేర్కొన్నారు.
అలాగే జనగామ ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కూడా పాలకులు నెరవేర్చాలని, వెంటనే అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఆర్టీఏ సభ్యుడు అభి గౌడ్ మాట్లాడుతూ, గతంలో తాను NSUI విద్యార్థి సంఘంలో ఉన్న సమయంలో జనగామకు మెడికల్ కాలేజ్ సాధన కోసం అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. ఉద్యమకారుల సమిష్టి పోరాటమే జనగామ మెడికల్ కాలేజీ అని, ఉద్యమకారులకు గుర్తింపు తెచ్చేలా కృషిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ కౌశిక్, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ కోఆర్డినేటర్ ఆసర్ల సుభాష్, బీసీ సంఘం నాయకులు బోడ రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

