విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
50 ఏళ్లు దాటిన ప్రతి విశ్వకర్మకు నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 28
పెద్దపల్లి: విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు దాటిన ప్రతి విశ్వకర్మకు నెలకు రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
శనివారం పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చందనగిరి గోపాల్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా విశ్వకర్మల సంప్రదాయ కులవృత్తులు క్రమంగా కనుమరుగవుతున్నాయని, దీంతో ఆ వర్గానికి చెందిన అనేక కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
విశ్వబ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పాలకమండలి చైర్మన్‌గా ఏర్రోజు బిక్షపతిని నియమించాలని కోరారు. 50 ఏళ్లు పైబడిన ప్రతి విశ్వకర్మకు నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. కులవృత్తులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఐదెకరాల స్థలం కేటాయించి ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లు లేని నిరుపేద విశ్వకర్మ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి విశ్వబ్రాహ్మణులు రాష్ట్రవ్యాప్తంగా మద్దతుగా నిలిచారని, తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో భీమోజు రాజేందర్, వడ్కాపురం నాగభూషణాచారి, నాగులమల్యాల ప్రసాద్, సాయి చరణ్, పెద్దపల్లి రవి, చిన్నోజు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
