ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ ఆగ్రహం
*విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – బీజేపీ నాయకుల డిమాండ్
జోగిపేట | నవంబర్ 27 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
జోగిపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ దళిత మోర్చా, ఓబీసీ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని సందర్శించి, అస్వస్థతకు గురైన విద్యార్థినుల పరిస్థితి, ఆహార నాణ్యత, వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థినులకు కనీసం నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడే నిర్లక్ష్య ధోరణికి అడ్డుకట్ట వేయాలని, ఫుడ్ పాయిజన్ ఘటనకు గల అసలు కారణాలను సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు చంటి ప్రభు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గాజుల అనిల్, దళిత మోర్చా నాయకులు నర్సింలు, జిల్లా నాయకులు పులుగు గోపాల్, ఓబీసీ మోర్చా అందోల్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, నాగేష్, మాజీ రాష్ట్ర నాయకులు ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు.

