📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి

కుల, మత రాజకీయాలతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు

రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి – కేవీపీస్ , ఎస్ ఎఫ్ ఐ , ఏ ఐఎస్ ఫ్ , టీపీఫ్ సంఘాల నాయకులు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26:

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాద విలువలను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కేవీపీస్ , ఎస్ ఎఫ్ ఐ , ఏ ఐఎస్ ఫ్ , టీపీఫ్ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీస్ , ఎస్ ఎఫ్ ఐ , ఏఐఎస్ ఫ్ , టీపీఫ్ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రతితో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ నేటికీ సమాజంలో కులవివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు, మహిళలపై వివక్ష, నిరుద్యోగం, విద్యా, వైద్య రంగాల్లో అసమానతలు కొనసాగడం ఆందోళనకరమన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలు, ఆర్ఎస్ఎస్ భావజాలం రాజ్యాంగంలోని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి మౌలిక సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నాయనే ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించే రాజకీయాలకు స్వస్తి పలికి రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారంగా పాలన సాగించాలని డిమాండ్ చేశారు.

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అంటరానితనాన్ని నిషేధించి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించారని గుర్తుచేశారు. అయినప్పటికీ నేటికీ కులం పేరుతో దూషణలు, దాడులు, ఆలయ ప్రవేశాల నిరాకరణ, సామాజిక వివక్ష కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగినప్పుడు బాధితులకు తక్షణ న్యాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కేవీపీస్ జిల్లా అధ్యక్షుడు మొదంపల్లి శ్రవణ్ మాట్లాడుతూ మహిళలకు విద్య, ఉపాధి, ఆస్తి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంలో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, వివక్షను అరికట్టడంతో పాటు పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.

టీపీఫ్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులను గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

ఏఐఎస్ ఫ్ జిల్లా కార్యదర్శి ప్రీతం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే కేవలం రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడం మాత్రమే కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పేదవాడికి, దళితుడికి, మహిళకు, కార్మికుడికి, రైతుకు అందేలా కృషి చేయడమే నిజమైన రాజ్యాంగ పరిరక్షణ అని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా అధ్యక్షుడు మొదంపల్లి శ్రవణ్, కుమ్మరి నవీన్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, టీపీఫ్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, ఏఐఎస్ఫ్ జిల్లా కార్యదర్శి ప్రీతం, సామాజిక ఉద్యమకారుడు కొంకటి లింగమూర్తి, అభివర్ధన్, మధు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.