కార్తీక సోమవారం వేళ కూకట్‌పల్లి అయ్యప్ప దేవస్థానంలో పడి పూజ మహోత్సవం వైభవం!
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక హాజరు – అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయం
కూకట్‌పల్లి, నవంబర్ 26 (ప్రజావాణి): కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి శ్రీ అయ్యప్ప దేవస్థానంలో పడి పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, అయ్యప్ప స్వాముల భజనలు, శరణుఘోషలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
రాహుల్ స్వామి, కార్తీక్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పడి పూజ కార్యక్రమాన్ని గురుస్వామి యోగీశ్వర శర్మ నేతృత్వంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన రాకతో భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అలాగే బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రావు సైతం కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గురుస్వామి యోగీశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించడం ఎంతో పవిత్రమైనదని, స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, గురుస్వాములు హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. భక్తులకు అన్నప్రసాద వితరణతో మహోత్సవం భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది


