భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు
ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు.. రీ-సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి
ఆన్లైన్ వివరాల ఆధారంగానే నివేదికలు సమర్పించాలి: రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 25:
భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసి, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో భూభారతి దరఖాస్తులు, హైకోర్టు కేసులు, భూముల రీ-సర్వే, జీఓ 58, జీఓ 76 కింద పెండింగ్ అంశాల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రీ-సర్వే పనులను నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
జీఓ 58, జీఓ 76 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
రెగ్యులరైజేషన్‌తో పాటు రెవెన్యూకు సంబంధించిన ప్రతి అంశం ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేశారు. ఆన్లైన్లో నమోదైన వివరాల ఆధారంగానే నివేదికలు సమర్పించాలని, డేటాకు సంబంధించి సందేహాలు ఉంటే ఈడీఎం, హెచ్ఎస్సీ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో సింగరేణి, జెన్కో భూములకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు. ఈ ప్రతిపాదనలు క్యాబినెట్ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నందున, అవసరమైన నివేదికలు అందిన వెంటనే ఇంధన శాఖ నుంచి క్లియరెన్స్ పొందేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాలో భూభారతి దరఖాస్తులు 11 మాత్రమే పెండింగ్
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు మాట్లాడుతూ జిల్లాలో భూభారతికి సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తున్నామని, ప్రస్తుతం కేవలం 11 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. జీఓ 76 కింద మొత్తం 1,893 దరఖాస్తులు రాగా, వాటిలో 1,581 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు.
అదేవిధంగా జీఓ 58 కింద మొత్తం 682 దరఖాస్తులకు గాను 348 దరఖాస్తులపై విచారణ పూర్తి చేసి క్లోజ్ చేసినప్పటికీ, పోర్టల్‌లో పెండింగ్‌గా కనిపిస్తున్నాయని వివరించారు. మిగిలిన 334 దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించి, సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ పరిపాలనాధికారి బి. ప్రకాష్, డి.ఈ. సెక్షన్ పర్యవేక్షకులు ధీరజ్, విజయ్, కలెక్టరేట్ రెవెన్యూ విభాగం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

