*రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అండ*
*శివ నాయక్ వైద్య చికిత్స కోసం రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు*
రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి):
మంచాల సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రం అందజేత
మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన రత్నావత్ శివ నాయక్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తలకు పెద్ద గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివకు తలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో భారీగా ఖర్చవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంచాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శివ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి ప్రమాద వివరాలను తెలియజేశారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శివ వైద్య చికిత్స నిమిత్తం రూ.7 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు మంచాల సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని శివ కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జెనిగే వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యే ఎల్‌ఓసీ నిధులు ఎంతో ఉపయోగకరమని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న పేద ప్రజలు అధైర్యపడవద్దని, వారికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారం, ప్రజలకు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు.


