పుట్టాపహాడ్ గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య ఇందిరమ్మ ఇండ్ల విచారణ.. పాలకవర్గం అభ్యంతరం.
పరిగి/కుల్కచర్ల :నవంబర్ 12,ప్రజావాణి :
కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మరియు విచారణ ప్రక్రియ గురువారం పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఈ ప్రక్రియపై గ్రామ సర్పంచ్ బోయిని అంజిలయ్య, ఉప సర్పంచ్ లాల్ బహుదూర్ శాస్త్రి మరియు పాలక మండలి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది…?
గతంలో విడుదలైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హులైన పేదలకు కాకుండా కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు ఇదివరకే ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. అయితే, తమ వినతిపై స్పందించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామ పాలకవర్గం ఆరోపించింది.
నోడల్ అధికారి విచారణకు వస్తున్నారనే సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శి కేవలం గంట ముందు మాత్రమే సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పాలక మండలికి అందించారని వారు పేర్కొన్నారు. పైఅధికారుల ఆదేశాల మేరకే విచారణ జరుపుతున్నామంటూ పోలీసు బలగాల నడుమ విచారణ చేపట్టడం సమంజసం కాదని వారు విమర్శించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయిని అంజిలయ్య మాట్లాడుతూ.. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉండటం వల్లే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల పహారాలో విచారణ జరపడం వంటి చర్యలు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి శ్రేయస్కరం కాదని అన్నారు.
ఈ వ్యవహారంపై నిరసన తెలిపేందుకు, నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడటానికి కుల్కచర్ల మండలంలోని బీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయానికి తరలిరావాలని సర్పంచ్ అంజిలయ్య పిలుపునిచ్చారు.


