మహిళలే గ్రామాభివృద్ధికి సారథులు..
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
విష్ణుపురం, విసునూరు, చెన్నూరులో మహిళా సమైక్య భవనాలు ప్రారంభం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలంలోని విష్ణుపురం, విసునూర్, చెన్నూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మూడు మహిళా సమైక్య భవనాలను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఒకే రోజు ఘనంగా ప్రారంభించారు.
విష్ణుపురంలో సర్పంచ్ అనూష రవి తో, విసునూరులో సర్పంచ్ బోలాగని రజిత యకన్న తో, చెన్నూరులో సర్పంచ్ కారుపోతుల శ్రీనివాస్ తో కలిసి భవనాలను ప్రారంభించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మూడు గ్రామాల్లోనూ మహిళలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి సాధించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఐక్యతకు, ఆర్థిక అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళలు సంఘాలుగా ఏర్పడి ఐక్యంగా ముందుకు సాగుతూ పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడంతో పాటు, బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కుట్టు మిషన్, బ్యూటీషియన్, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తులు వంటి స్వయం ఉపాధి మార్గాల ద్వారా సొంత కాళ్లపై నిలబడాలని పిలుపునిచ్చారు.
మహిళా సమైక్య భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకూడదని, మహిళల సమస్యల చర్చకు, శిక్షణ కార్యక్రమాలకు, అవగాహన సదస్సులకు, నూతన ఆలోచనలకు వేదికలుగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ఈ భవనాన్ని తన సొంత ఇంటిలా భావించి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కోరారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని, మహిళల సంక్షేమం, అభ్యున్నతికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



