📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం

📰 Generate e-Paper Clip

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం

ఆసరా పింఛన్ల హామీని తక్షణమే అమలు చేయాలి

వీహెచ్‌పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్. గోపాల్ రావు, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ హెచ్చరిక

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 12

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు.

గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ రోడ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్. గోపాల్ రావు, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించిన జాతీయస్థాయి సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు కీలక పదవులు లభించాయని తెలిపారు. వీహెచ్‌పీఎస్ జాతీయ కమిటీ సభ్యురాలిగా చింతిరెడ్డి సంతోష రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీర్జా అమీన్ బేగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కన్నం స్వామి నియమితులైనట్లు వెల్లడించారు. రాబోయే 15 రోజుల్లో జిల్లా కమిటీని కూడా పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

పింఛన్ల హామీని వెంటనే అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని వారు అన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల ఆసరా పింఛన్, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రకటించిన రూ.15 వేల పింఛన్‌ను కూడా తక్షణమే మంజూరు చేయాలని కోరారు.

కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియలో ఒంటరి మహిళలు, వృద్ధుల విభాగాలను తొలగించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 12 లక్షల పింఛన్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివ్యాంగులకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి

మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దివ్యాంగ పురుషులు సగం టికెట్ ధర చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. లేనిపక్షంలో దివ్యాంగులు, వారి కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంబాల నరేష్, ఐరెడ్డి నారాయణ రెడ్డి, కన్నం స్వామి, ఎం. అమీన్ బేగ్, నరిగే మల్లేశ్వరి, కల్వల స్వాతి, రాసపెల్లి రవి, గోస్కె స్వామి, పల్లె రాకేష్, కాదాసి కిరణ్, పోశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.