మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు
• దామోదర రాజనర్సింహపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు
మన ప్రజావాణి | జోగిపేట | నవంబర్ 03 | జిల్లా ప్రతినిధి
ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వస్తున్న కథనాలను అందోల్–జోగిపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైన ప్రచారమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ.. తమ నాయకుడు దామోదర రాజనర్సింహపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మబోరని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. అందోల్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయని, మంత్రి సహనం, ఓర్పు, క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు.
రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన నాయకుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలని హితవు పలికారు. బీఫాం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టిన నాయకుడి గౌరవాన్ని మరిచి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎదగడానికి బాటలు వేసిన నాయకుడినే విమర్శించడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
“బీఫాం ఇవ్వడం నాయకుడి గొప్పతనం.. గెలిపించుకోవడం ప్రజల గొప్పతనం.. ఎదిగాక కృతజ్ఞత మర్చిపోవడం మాత్రం రాజకీయ అహంకారం” అని చిట్టిబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వాన్ని విమర్శలతో తగ్గించలేరని, ఆయన అభిమానుల ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.

