📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసిద్దాపూర్ డంపింగ్ యార్డుకు బ్రేక్..

సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు బ్రేక్..

📰 Generate e-Paper Clip

*సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు బ్రేక్..*

*మంత్రి ప్రకటనతో 60 గ్రామాలకు ఊరట!*

*“సిద్దాపూర్‌కు డంప్‌యార్డు రానివ్వం”.. మంత్రి పొంగులేటి స్పష్టమైన హామీ*

*సమస్యను ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..*

*పట్టువదలని ప్రయత్నాలకు ఫలితం*

*వంద రోజులకు పైగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి కీలక మలుపు*

*షాద్‌నగర్ రాజకీయాల్లో కీలక మలుపు*

షాద్నగర్ నవంబర్ 07(మన ప్రజా వాని )
ఒక సమస్యను గుర్తించడం ఒక ఎత్తయితే.. దానికి పరిష్కారం చూపించే దిశగా అధికార యంత్రాంగాన్ని కదిలించడం మరో ఎత్తు. ప్రజల ఆందోళనను అర్థం చేసుకుని, వారి పక్షాన నిలబడి ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపించేందుకు కృషి చేస్తే ప్రజాప్రతినిధిగా దాని ఫలితం ఎలా ఉంటుందో సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యవహారం మరోసారి చాటిచెప్పింది. హైదరాబాద్ నగరంలోని చెత్తాచెదారాలను గ్రామీణ ప్రాంతాలకు తరలించి పర్యావరణాన్ని కలుషితం చేసే ఎకో టౌన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 60 గ్రామాల ప్రజలు వంద రోజులకు పైగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన సిద్దాపూర్ గ్రామస్తులకు పెద్ద ఊరటనిచ్చింది. సిద్దాపూర్‌కు డంపింగ్ యార్డు రానివ్వబోమని మంత్రి స్పష్టం చేయడంతో ప్రజా ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సమస్య పరిష్కార దిశగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కొత్తూర్ మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామ శివారులో సుమారు 160 ఎకరాల భూమిలో ఎకో టౌన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను ఇక్కడికి తరలించి రీసైక్లింగ్ చేసే ఆలోచనతో ప్రభుత్వం జీవో నంబర్ 641ను విడుదల చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ నిర్ణయంతో సిద్దాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే భూముల విలువలు పడిపోవడంతో పాటు గాలి, నీరు కలుషితమై సుమారు 60 గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

*60 గ్రామాల ప్రజల ఉద్యమం.. వంద రోజులకు పైగా పోరాటం*

డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు రాంబాబు నాయక్ చైర్మన్‌గా, కార్మిక సంక్షేమ సంఘం నాయకుడు పినపాక ప్రభాకర్ కన్వీనర్‌గా సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరించారు. తాజాగా రిలే నిరాహార దీక్షలు సైతం చేపట్టి, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు ఈ పోరాటానికి మద్దతుగా తరలిరావడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు కూడా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
మొదటి నుంచీ ప్రజలకు అండగా ఎమ్మెల్యే శంకర్.. ప్రభుత్వ పెద్దలతో చర్చలు
ఈ సమస్యపై మొదటి నుంచీ స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సిద్దాపూర్ ప్రాంతానికి డంపింగ్ యార్డు రాకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల ఆందోళనను కేవలం స్థానిక సమస్యగా కాకుండా, వేలాది కుటుంబాల ఆరోగ్యం, పర్యావరణం, రైతుల జీవనాధారంతో ముడిపడిన అంశంగా పరిగణించారు. ఈ విషయాన్ని శాసనసభలోనూ ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి సిద్దాపూర్ ప్రజల అభ్యంతరాలు, పరిసర గ్రామాల ఆందోళనలు, డంపింగ్ యార్డు వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని తన వంతు ప్రయత్నాలు కొనసాగించారు.

*మంత్రి ప్రకటనతో కదిలిన ఉద్యమం.. ఎమ్మెల్యే కృషికి ప్రశంసలు*

శనివారం నందిగామ మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా సిద్దాపూర్ డంపింగ్ యార్డు అంశంపై స్పందిస్తూ అక్కడికి డంపింగ్ యార్డు రానివ్వబోమని స్పష్టం చేశారు. మంత్రి నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటనతో వంద రోజులకు పైగా ఆందోళన చేస్తున్న సిద్దాపూర్, పరిసర గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఒకవైపు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులు ఉద్యమానికి మద్దతుగా నిరసనలు కొనసాగిస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ పెద్దలతో నేరుగా చర్చలు జరుపుతూ సమస్యకు పరిష్కారం చూపే దిశగా చేసిన ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మంత్రి పొంగులేటి ప్రకటన చేస్తున్న సమయంలో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్ కృషిని అభినందిస్తూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేయడం విశేషం. ప్రజల నుంచి వచ్చిన నిరసనను ప్రభుత్వానికి చేరవేయడమే కాకుండా, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి స్థాయిలో చర్చించి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేయడం ఎమ్మెల్యే చొరవకు నిదర్శనంగా కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
ఒక ప్రజా సమస్య పరిష్కారం కావాలంటే కేవలం ఆందోళనలు, విమర్శలతోనే సరిపోదని, ప్రజల గొంతుకను ప్రభుత్వ పెద్దల వరకు తీసుకెళ్లి నిర్ణయాత్మక స్థాయిలో ప్రయత్నాలు చేయడం కూడా అవసరమని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. సిద్దాపూర్ డంపింగ్ యార్డు విషయంలో మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన నిరంతర ప్రయత్నాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. అయితే మంత్రి ప్రకటనకు అనుగుణంగా అధికారిక నిర్ణయం, తదుపరి ఉత్తర్వులు వెలువడాల్సి ఉండటంతో గ్రామస్తులు తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.