బేబీ జనని వైద్య చికిత్సకు తిరుమలాపూర్ చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం: ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి.
పరిగి/కుల్కచర్ల :నవంబర్ 10,ప్రజావాణి:
నగరంలోని రెయిన్బో ఆసుపత్రిలో ప్రాణాంతక స్థితిలో చికిత్స పొందుతున్న చిన్నారి బేబీ జనని వైద్య ఖర్చుల నిమిత్తం తిరుమలాపూర్కు చెందిన ప్రముఖులు చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం అందజేశారు.
చిన్నారి జనని అనారోగ్యంతో రెయిన్బో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రికి చేరుకుని పాప ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాప తల్లిదండ్రులను పరామర్శించి, వారికి తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం కొంత నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. కష్టకాలంలో అధైర్యపడవద్దని, చిన్నారి త్వరలోనే కోలుకుంటుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేబీ జనని ప్రాణాలు కాపాడేందుకు భారీ మొత్తంలో వైద్య ఖర్చులు అవుతున్నాయని, ఆ నిరుపేద కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి తమవంతుగా తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాలను నిలబెట్టే మహత్కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ సహాయానికి, చూపిన చొరవకు పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలియజేశారు.

