📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిర్లక్ష్యం చేస్తే సంబరం కాస్తా విషాదం

నిర్లక్ష్యం చేస్తే సంబరం కాస్తా విషాదం

📰 Generate e-Paper Clip

నిర్లక్ష్యం చేస్తే సంబరం కాస్తా విషాదం.

సురక్షిత దీపావళే నిజమైన దీపావళి
పసర ఎస్సై తాజుద్దీన్

*ప్రజావాణి, ములుగు జిల్లా ప్రతినిధి, నవంబర్ 07*

దీపావళి అంటేనే వెలుగులు… ఆనందం… సంబరం… కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు, ఆ సంబరం కాస్తా కన్నీటిగా మారడానికి… అందుకే ఈ దీపావళిని సురక్షితంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని గోవిందరావుపేట మండల ప్రజలకు పసర ఎస్సై తాజుద్దీన్ గట్టిగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ రోజు ఉత్సాహంలో పడి జాగ్రత్తలు మర్చిపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, చిన్నపాటి పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని స్పష్టం చేశారు.

*టపాసులు కాల్చే ముందు ఇది గుర్తుపెట్టుకోండి…*

సింథటిక్, నైలాన్ దుస్తులు వేసుకుని టపాసులు కాల్చడమంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమేనని అన్నారు. ఒంటికి అంటుకునే దుస్తులకు దూరంగా ఉండి, ఒంటికి సరిపడే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని గట్టిగా సూచించారు.

ఇళ్ల మధ్య, విద్యుత్ వైర్ల కింద, వాహనాల పక్కన బాణసంచా కాల్చడం వద్దని హెచ్చరించారు. ఇళ్లు, వైర్లు, వాహనాలు లేని విశాలమైన బహిరంగ ప్రదేశంలోనే టపాసులు కాల్చాలని తేల్చి చెప్పారు.

*పిల్లల విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు…*

చిన్నపిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వడం అంటే ప్రమాదానికి వదిలేయడమేనని అన్నారు. పెద్దలు పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకోవాలని, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.

*కాలితే ఏం చేయాలి..?*

కాలిన గాయాలైతే తొందరపడి సబ్బు, ఐస్ వాడి గాయాన్ని మరింత పెంచుకోవద్దని అన్నారు. వెంటనే 15-20 నిమిషాల పాటు చల్లటి నీటి కింద గాయాన్ని ఉంచాలని, గాయం తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అత్యధికంగా బాణసంచా కాల్చి దట్టమైన పొగను సృష్టిస్తే శ్వాసకోశ సమస్యలు తప్పవని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అస్తమా రోగులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా భయపడవద్దని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని, వెంటనే 108 కు కాల్ చేసి సేవలు వినియోగించుకోవాలని గోవిందరావుపేట మండల ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.