కొత్తపల్లి పాఠశాలల్లో ఉదయం అల్పాహార పంపిణీ
విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ: సర్పంచ్ జంబుల రజిత నరసింహులు.
పరిగి/కొత్తపల్లి:నవంబర్0 2(ప్రజావాణి ):
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల శారీరక దృఢత్వం, విద్యాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదయం అల్పాహార పంపిణీ కార్యక్రమం కొత్తపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అమలవుతున్న ఈ పథకంలో భాగంగా, స్థానిక ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు సోమవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జంబుల రజిత నరసింహులు, ఉపసర్పంచ్ రాములమ్మ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రజిత నరసింహులు మాట్లాడుతూ, “విద్యార్థులు ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చదువుపై చక్కటి ఏకాగ్రత కుదురుతుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శశిధర్ రెడ్డి, కర్నే ఆంజనేయులు, కర్నే శ్రీను, వార్డు సభ్యులు జోగు అలివేలు, కృష్ణయ్య, జోగు వెంకటమ్మ, శ్రీనివాస్, చెన్నయ్య, కటికే యాదిలాల్, జంబుల అనంతయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు చెన్నయ్య, కర్నే సాయన్న, గాడి యాదయ్య, కావలి వెంకట్రాములు, మహిళా సంఘాల అధ్యక్షురాలు పార్వతమ్మ, జంబుల నరేందర్, సోషల్ మీడియా ప్రతినిధి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

