📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి...

జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి…

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి…

రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి..

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్..

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ మండల కార్యాలయంలో సోమవారం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ
జనగామ జిల్లాలో ఎల్-నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చాలా మంది రైతులు పంటలు సాగు చేయలేకపోయారని, అప్పులు చేసి సాగు చేసిన వారికి కూడా దిగుబడులు లేక తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో కేవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదని, వాస్తవంగా జిల్లా మొత్తంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఘన్‌పూర్ మండలంలో కొన్ని గ్రామాలకు నీళ్లు వచ్చాయని కరువు లేదనుకోవడం అవాస్తవమని, గ్రామాల వారీగా పరిశీలిస్తే తీవ్ర కరువు ఉందని అన్నారు.

ప్రభుత్వానికి సీపీఎం డిమాండ్లు:

1. వాస్తవ పరిస్థితులు పరిశీలించి జనగామ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి.
2. పంటలు సాగు చేయలేకపోయిన రైతులకు, పంట నష్టపోయిన రైతులకు షరతులు లేకుండా వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి.
3. పత్తి పంటకు ఎకరాకు రూ.50 వేలు, వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.
4. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలి.
5. వ్యవసాయ రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలి.
6. కరువు వల్ల ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.
7. ప్రతి పేద కుటుంబానికి నెలకు 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలి, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతాంగాన్ని, పేద ప్రజలను సమీకరించి సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా చందు నాయక్, మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, గట్ల మల్లారెడ్డి, చిలుముల్ల భాస్కర్, పోలాసు పరమేష్, నాయకులు మంగ బీరయ్య, బొంకురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.