అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
* ఈ నెల 6వ తేదీ వరకు తుది గడువు
* కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోత్కూర్ వెంకటేష్ పిలుపు.
పరిగి/కులకచర్ల: నవంబర్02( ప్రజావాణి)
రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోత్కూర్ వెంకటేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విద్యావంతులైన పట్టభద్రులు ఓటరుగా నమోదై తమ చైతన్యాన్ని చాటాలని సూచించారు. గుర్తింపు పొందిన ఏదేని విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు దాటిన వారు ఈ ఓటరు నమోదుకు అర్హులని స్పష్టం చేశారు.
ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ వరకు మాత్రమే తుది గడువు ఉందని, సమయం చాలా తక్కువగా ఉన్నందున పట్టభద్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుకు ఫారం-18తో పాటు డిగ్రీ ఒరిజినల్ లేదా ప్రొవిజినల్ సర్టిఫికెట్ (లేదా మార్కుల మెమో), ఆధార్ కార్డు, సాధారణ ఓటరు గుర్తింపు కార్డు (EPIC నంబర్), పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

