*సాగు భూముల్లో ఫారెస్ట్ కందకాలు.. గిరిజనుల ఆందోళన*
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గుత్తికోయ గూడెంలో ఉద్రిక్తత నెలకొంది.
గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 30 ఎకరాల భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు.
శుక్ర, శని వారాల్లో పసర ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో పనులు మొదలుపెట్టారు.
విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజనులు జేసీబీకి అడ్డుగా కూర్చుని నిరసన తెలిపారు.
భూములు అప్పగించకపోతే బలవంతంగా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారని వాపోయారు.
మొక్కజొన్న, పెసర పంటలతో జీవిస్తున్న తమకు భూములే జీవనాధారం అని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు పోతే బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు.
ఫారెస్ట్ అధికారులు డబ్బులు, మేకలను డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదురు తిరిగితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెబుతున్నారు.
గతంలో జనగలంచలో గిరిజనులను చెట్టుకు కట్టి కొట్టిన ఘటన మరవక ముందే మళ్లీ దాడులు మొదలయ్యాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గిరిజనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చాక కూడా దాడులు ఆగలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
మంత్రి సీతక్క ఇలాకాలోనే ఇలా జరగడం పట్ల గిరిజన గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
వెంటనే కందకాలు తీయడం ఆపి, పోడు రైతులకు రక్షణ కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

