📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవాటా పెంచితేనే భూములిస్తాం.. కొర్రెముల రైతుల స్పష్టీకరణ....కొత్త జీవోతో రైతులకు మేలు జరుగుతుంది: తహసీల్దార్

వాటా పెంచితేనే భూములిస్తాం.. కొర్రెముల రైతుల స్పష్టీకరణ….కొత్త జీవోతో రైతులకు మేలు జరుగుతుంది: తహసీల్దార్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 26 (ప్రజా లక్ష్యం):

ప్రభుత్వం చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ పథకంలో రైతుల వాటాను పెంచితేనే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామని కొర్రెముల గ్రామ రైతులు స్పష్టం చేశారు. సోమవారం కొర్రెముల, ప్రతాపసింగారం గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌పై తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ల్యాండ్ పూలింగ్‌లో 70:30 నిష్పత్తి ప్రకారం రైతుల వాటాను పెంచడంతో పాటు, భూముల సేకరణకు సంబంధించి నిర్ణీత గడువును ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో తమ భూములకు ఎకరాకు కోట్ల రూపాయల విలువ పలుకుతుంటే, పరిహారంగా ఎకరాకు 1,400 గజాల స్థలాన్ని మాత్రమే తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాము ల్యాండ్ పూలింగ్ పథకానికి వ్యతిరేకం కాదని, రైతులకు అందించే వాటాను పెంచితే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తామని తెలిపారు. ప్రైవేటు బిల్డర్లు సైతం 70:30 నిష్పత్తిలో వాటా ఇస్తున్నారని, ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరించాలని కోరారు.

కొత్త జీవోతో రైతులకు మేలు జరుగుతుంది: తహసీల్దార్

ప్రతాపసింగారం గ్రామంలో జరిగిన గ్రామసభలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్‌లో ముందుగా బఫర్ జోన్ కోసం 50 మీటర్ల మేర హద్దులు ఏర్పాటు చేసి, మిగిలిన 450 మీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ కొత్త హద్దులు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి కొత్త జీవో తీసుకురావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లార

ఘట్కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఐదు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్ 240 తీసుకొచ్చిందని, ఈ విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని మల్టీపర్పస్ జోన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. గతంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రధానంగా నివాస అవసరాలకే పరిమితమై ఉండగా, ప్రస్తుతం చేపడుతున్న పథకంలో హై రైజ్ భవనాలు, టవర్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, మల్టీప్లెక్స్‌లు, జాతీయ రహదారులకు అనుసంధానమైన రహదారులతో కూడిన వెంచర్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

అయితే, ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా తమ వాటాను పెంచితేనే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామని రైతులు మరోసారి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్‌ఐ కావ్య, సర్వేయర్ రూప, ప్రతాపసింగారం, కొర్రెముల గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.