యాసంగికి సబ్సిడీపై శనగ విత్తనాలు
బెజ్జంకి మండలానికి 93 బస్తాల కేటాయింపు
బెజ్జంకి, అక్టోబర్ 3 (ప్రజావాణి)
జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్‌లో భాగంగా యాసంగి–2026 సీజన్‌కు శనగ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో బెజ్జంకి మండలానికి 93 బస్తాల శనగ విత్తనాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. నంద్యాల గ్రామ్ (NBeG-452) రకం విత్తనాలు ఒక్కో ప్యాకెట్లో 16 కిలోలు ఉంటాయని తెలిపారు. వీటి పూర్తి ధర రూ.1,392 కాగా, సబ్సిడీ ధర రూ.960గా నిర్ణయించారని చెప్పారు. ఇందులో ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.432 కాగా, రైతు చెల్లించాల్సిన మొత్తం రూ.960 మాత్రమేనని తెలిపారు.
శనగ సాగు చేయదలిచిన రైతులు భూమి పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు తీసుకుని సోమవారం నుంచి తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను సంప్రదించి సబ్సిడీపై శనగ విత్తనాలు పొందాలని మండల వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు.

