📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విజయవాడలో అక్టోబర్ 5న సీఆర్ఎం టీచర్స్ భారీ ఆందోళన: నెల్లూరు జిల్లా అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు...

విజయవాడలో అక్టోబర్ 5న సీఆర్ఎం టీచర్స్ భారీ ఆందోళన: నెల్లూరు జిల్లా అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపు

📰 Generate e-Paper Clip

నెల్లూరు,అక్టోబర్ 3 ప్రజావాణి సమగ్ర శిక్ష-పాఠశాల విద్యాశాఖలో గత 15 ఏళ్లుగా ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన విధులను నిర్వర్తిస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్  తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరుబాట పట్టారు. ఏపీ సీఆర్ఎం టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ (సోమవారం) విజయవాడలోని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్  రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన భారీ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ సీఆర్ఎం డబ్ల్యూఏ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ మేరకు శనివారం నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీ రావు ని,అలాగే జిల్లాలోని ఆయా మండల విద్యాశాఖాధికారులను సీఆర్ఎం టీచర్లు కలిసి ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లాలోని క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లందరూ ఈ ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కోరారు.

కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి – నారా లోకేష్ హామీల ప్రస్తావన:

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ. గత 2024 సంవత్సరంలో సీఆర్ఎం టీచర్లు తమ హక్కుల కోసం దాదాపు 22 రోజుల పాటు సుదీర్ఘమైన సమ్మెను నిర్వహించారని గుర్తు చేశారు. ఆ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా,ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉన్న శ్రీ నారా లోకేష్ గారు సీఆర్ఎం టీచర్ల సమస్యలను ఆలకించి, తాము అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలర్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంత కాలం గడుస్తున్నా.ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎలాంటి పురోగతి లేదని, అందుకే తాము తదుపరి కార్యాచరణగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ముందు ఉంచిన 9 ప్రధాన డిమాండ్లు ఇవే:

1. ఉద్యోగాల క్రమబద్ధీకరణ – టైమ్ స్కేల్ అమలు: జీ.ఓ.ఎమ్.ఎస్. నెం. 65 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన 4034 సీఆర్ఎం టీచర్స్ పోస్టుల్లో డిగ్రీ, బీఈడీ, మరియు టెట్  ఉత్తీర్ణత సాధించి, స్కూల్ అసిస్టెంట్ కుండాల్సిన పూర్తి అర్హతలతో పని చేస్తున్న టీచర్లందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలి. అంతవరకు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ వేతనం రూ.44,570/- లతో పీఆర్సీ-2022  అనుసరించి ‘మినిమం టైమ్ స్కేల్’ అమలు చేస్తూ వేతనాలు పెంచాలి.

2. వేతనాల పెంపుదల: గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి వేతన పెంపుదల లేకుండా కేవలం రూ. 23,500/- లకే సీఆర్ఎం ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ అరకొర జీతంతో కుటుంబాలను పోషించడం అత్యంత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

3. డీఎస్సీలో వెయిటేజీ: పాఠశాల విద్యాశాఖలో 15 ఏళ్లుగా స్కూల్ అసిస్టెంట్ అర్హతలతో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సీఆర్ఎం టీచర్లకు రాబోయే డీఎస్సీ (DSC) పరీక్షల్లో ప్రత్యేక వెయిటేజీ కల్పించాలి.

4. అలవెన్సుల పునరుద్ధరణ: క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రయాణాలు చేస్తూ విధులను నిర్వహించే సీఆర్ఎం టీచర్లకు గతంలో ఉన్న ట్రావెలింగ్ అలవెన్స్ (TA), మొబిలిటీ గ్రాంటులను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు తమ సొంత వేతనాల నుంచే పెట్టుకోవాల్సి వస్తోందని, తక్షణమే ఈ అలవెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

5. రిటైర్మెంట్ వయస్సు పెంపు – బెనిఫిట్స్: సీఆర్ఎం టీచర్స్ రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. విధి నిర్వహణ పూర్తి చేసుకుని రిటైర్ అయిన వారికి గ్రాడ్యుయిటీతో పాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలి.

6. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం: ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగానే సీఆర్ఎం టీచర్లకు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.

7. కారుణ్య నియామకాలు – ఎక్స్ గ్రేషియా: విధుల్లో ఉంటూ ఎవరైనా అనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబంలో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు తగిన ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి.

8. తక్షణ ఉపశమనం: పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు తక్షణ ఉపశమనంగా వేతనాలను పెంచాలి.

9. విజయవాడ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి: పైన పేర్కొన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడమే ధ్యేయంగా అక్టోబర్ 5న విజయవాడలోని రాష్ట్ర సమగ్ర శిక్ష ఎస్పీడీ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.ఈ న్యాయపోరాటంలో నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ ప్రత్యక్షంగా పాల్గొని విజయవంతం చేయాలని, తమ హక్కులను సాధించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సీఆర్ఎం టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని మండల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.