ముత్యాలమ్మ ఆలయ భూమిపై కబ్జా ఆరోపణలు!
ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు.. పట్టించుకోకుండా దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట,అక్టోబర్ 28 :
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణ భూమి కబ్జాకు గురవుతోందని ఆలయ కమిటీ ఆరోపించింది. ఆలయ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని పేర్కొంటూ కమిటీ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన నల్ల బూతుల స్వామి, రేఖ రామలక్ష్మి ఆలయ భూమిని కబ్జా చేశారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై వారిని ప్రశ్నించగా, “మీరేం చేస్తారు?” అంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.గ్రామదేవత ఆలయానికి సంబంధించిన భూమి విషయంలో వివాదం తలెత్తడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ భూమి హద్దులను పరిశీలించి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ కోరుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
