📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభూ వివాదంతో ఐదేళ్లుగా రైతుకు ఇబ్బందులు

భూ వివాదంతో ఐదేళ్లుగా రైతుకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

భూ వివాదంతో ఐదేళ్లుగా రైతుకు ఇబ్బందులు!

• అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న భూ తగాదా

• కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ నివేదికలపై సమగ్ర విచారణ జరపాలి

హుజూర్‌నగర్, అక్టోబర్ 24 (ప్రజావాణి): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం
నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం వరకు చేరినా సమస్య పరిష్కారం కావడం లేదని రైతు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తన భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని, వ్యవసాయం చేసుకునే సమయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు.
కుటుంబ భూ పంపకాలతో మొదలైన వివాదం
రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికలదిన్నె గ్రామానికి చెందిన దివంగత నల్లమల జానకిరామయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నలుగురు కుమారులకు వ్యవసాయ భూములను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో పెంచికలదిన్నె రెవెన్యూ పరిధిలోని భూమిని తనకు, తన తమ్ముడు శ్రీనివాసరావుకు సమానంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.
తాను ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఖమ్మంలో నివసించేవాడినని, దీంతో తన వాటా భూమిని సుమారు పదేళ్లపాటు తమ్ముడికి కౌలుకు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం కౌలు విషయంలో విభేదాలు రావడంతో తన భూమిని తానే సాగు చేసుకుంటానని కోరినట్లు తెలిపారు. అప్పటి నుంచి తన భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
కోర్టు ఉత్తర్వులున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన
భూమి హక్కులకు సంబంధించి ఇరువురు హుజూర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్‌ ఉత్తర్వులు పొందినట్లు రామారావు తెలిపారు. అయినప్పటికీ వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
వ్యవసాయ సీజన్‌ దాటిపోకుండా తన భూమిలో పనులు చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తనపై, తనకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్న వారిపై దాడికి దిగినట్లు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ నివేదికపై సమగ్ర విచారణ చేయాలి
వివాదానికి సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక రూపొందించినట్లు రామారావు తెలిపారు. భూమి చుట్టుపక్కల రైతులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించి నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలోని అంశాలను పూర్తిగా పరిశీలించి, ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అలాగే భూ రికార్డులు, పట్టా వివరాలు, గతంలో జరిగిన భూ లావాదేవీలపై సందేహాలున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్న భూములకు సంబంధించిన రికార్డులను కూడా తనిఖీ చేయాలని కోరారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
భూ వివాదానికి సంబంధించిన ఫిర్యాదులు, పోలీసుల చర్యలు, రెవెన్యూ నివేదికలు, న్యాయస్థాన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రామారావు కోరారు. నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో గత మూడు నెలల సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే సంబంధిత పరిణామాలపై వివరాలు తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తన భూమిలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించి, భూ వివాదానికి చట్టపరంగా పరిష్కారం చూపాలని రైతు రామారావు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.