ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా
సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్కా బేకరీలో పని చేస్తున్న ఉద్యోగులు తమకు గత 3 నెలలుగా రావలసిన జీతాలను ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం కొత్తహరిపేట గ్రామానికి చెందిన భానోత్ దేశాయ్ తనకు గ్రామంలో గల భూమి నిషేధిత జాబితాలో చూపుతోందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన కొండ్ర సుదర్శన్ తమ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వేమనపల్లి మండలం సంపుటం గ్రామానికి చెందిన కుబిడే వెంకటేశం రైతులతో కలిసి నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువలో పూడుకుపోయిన మట్టిని తొలగించి పంట సాగుకు నీటిని అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామానికి చెందిన ఆతుకూరి సుప్రజ చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సత్తార్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని పోచమ్మ చెరువు నుండి వచ్చే వరద కాలువకు సంబంధించి జరిగిన భూ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సి.పి.ఎం. జిల్లా ప్రతినిధి బోడెంకి చందు జిల్లాలోని నెన్నెల మండలం కోనంపేట ఆదివాసి సాగు భూములలో జరిగే దౌర్జన్యాలు, దాడులను ఆపి పోడు సాగు చేసుకుంటున్న భూములు వారికి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. భీమారం మండలం మద్దికల్ గ్రామానికి చెందిన జయ్యారపు దుర్గ ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి జాబితాలో తన పేరు వచ్చిందని, ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన లిక్కి శంకరయ్య తన కూతురుకు గిఫ్టు డీడ్ ద్వారా ఆస్తి ఇచ్చానని, ఇప్పుడు తనకు ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నానని, తనకు అట్టి ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరుతూ అర్జీసమర్పించారు. నస్పూర్ లోని 37వ వార్డుకు చెందిన జె.కృష్ణారావు తమ వార్డు ప్రగతి నగర్ లో సి.సి. రహదారులు, మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 47 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు
సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “స్వేచ్ఛా రథం” వాహనాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి క్రాంతి కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ వంటి దురాచారాలను నిర్మూలించి కార్మికులకు న్యాయం జరిగేలా స్వేచ్ఛ రథం ద్వారా అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు సహాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో బాండెడ్ లేబర్ హెల్ప్ లైన్ నం.080-6943434 పై అందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, భూగర్భ గనులు, క్వారీయింగ్, వ్యవసాయ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు అవగాహన కల్పించి వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..

