📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

*ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ*

10 ఏళ్లు గడుస్తున్నా చెరగని ఆర్.వి.కె స్ఫూర్తి – హైదరాబాద్ లో ఘనంగా సంస్మరణ సభ

జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ (ఓపిడిఆర్)నేత కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ జీవితం ఆదర్శమైనదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఆర్.వి.కె అమరులై 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ గ్యాలరీలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు.

ఈ సభకు కామ్రేడ్ కె. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్.వి.కె సత్యనారాయణ చిత్రపటానికి విప్లవ కవి నిఖిలేశ్వర్, వి ప్రకాష్, జి సత్యనారాయణ రెడ్డి తదితర వక్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కె సత్యనారాయణ తన సందేశంలో ఆర్.వి.కె సంస్మరణ సభ జరుపుకోవడం ప్రజాస్వామిక హక్కుల హననం జరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు.

విప్లవ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమించిన ఆర్.వి.కె సత్యనారాయణ పదవ వర్ధంతి అని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసిందని అన్నారు. సభలు పెట్టుకునే, సమావేశాలు జరుపుకునే, మాట్లాడుకునే పరిస్థితులు లేని ఆ కాలంలో వారు ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ కోసం ప్రజలు ఏ విధంగా తమ హక్కులను పరిరక్షించుకోవాలో తమ కార్యాచరణ ద్వారా నిరంతరం నిరూపించారని కొనియాడారు. 70, 80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలో కూడా ప్రజల హక్కుల అణచివేత సాగిందని, ప్రజలు మాట్లాడితే పాలకులు అణచివేత చర్యలు కొనసాగిస్తున్నా ఏదో రూపంలో ప్రజల నుండి ప్రతిఘటన సాగుతుందని అన్నారు. నేడు భారతదేశంలో కేంద్రంలో మోదీ, అమిత్ షాల రూపంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల అణచివేత సాగుతోందని విమర్శించారు. సభలు సమావేశాలకు కోర్టుల ద్వారా అనుమతి తీసుకునే దుస్థితి ఈ దేశంలో ఏర్పడిందని, అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల అణచివేత ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు.

ప్రజల హక్కుల అణచివేత కొనసాగుతున్నప్పుడు హక్కుల పరిరక్షణ కోసం కామ్రేడ్ ఆర్.వి.కె దృఢంగా నిలిచి తమ పోరాట స్వరాన్ని ప్రజల పక్షాన వినిపించిన చరిత్ర మన ముందుందని అన్నారు. టీచర్స్ గిల్డ్ లో అయ్యర్ గారితో కలిసి పనిచేస్తూ ఆనాడు ప్రైవేటు స్కూళ్ల సమస్యలపై పోరాడారని తెలిపారు. ఆర్.వి.కె గారు ఓపిడిఆర్ లోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు, ఉద్యమ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు ఎక్కడ తలెత్తినా అక్కడికి ప్రయాణించి ఆ సమస్యలపై గొంతు విప్పి పాలకులను నిలదీసి నిత్యం ప్రజల పక్షపాతిగా నిలిచేవారని కొనియాడారు.

కొండ వెంకటరెడ్డి ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా ప్రజాసంఘాలపై కేసులు, పోలీసుల దాడులను, దౌర్జన్యాన్ని ఎదిరించి ముందుకు నడిచిన తీరు ఆర్.వి.కె ప్రజా ఉద్యమాలతో ఎంతటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం తీవ్ర అణచివేత, ఎన్కౌంటర్లు, హత్యలతో చెల్లాచెదురైనప్పుడు నిజనిర్ధారణ కమిటీ వేసి శ్రీకాకుళంలో పర్యటించి గిరిజనులు విన్నవించిన నిర్బంధపు అనుభవాలను చూసి విని చలించిపోయిన అనుభవం మర్చిపోలేని గొప్ప అనుభూతి అని అన్నారు. నాడు 11 మందిని ఒకచోట పట్టుకొని ఎదురుకాల్పులతో హత్య చేస్తే అందులో ఒకరు తప్పించుకున్న ఘటనను గిరిజనులు వివరించినప్పుడు ఆ దృశ్యం కళ్ల ముందు కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం ఎదురుకాల్పుల హత్యలపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక నేటికీ ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినదిగా ఉంటుందని అన్నారు.

ఆర్.వి.కె సింగరేణి ప్రాంతంలో అయినా ఒక కామ్రేడ్ అరెస్టై పోలీసుల హింసకు గురవుతున్నాడని తెలిసినప్పుడు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయి పోలీసు అధికారులను నిలదీసి వారిని విడిపించుకునేవారని, పాతబస్తీలో టీచర్ అయిన కామ్రేడ్ ఎం.టి ఖాన్ లాగానే ధైర్యం, చొరవ, పట్టుదలతో పనిచేసేవారని కొనియాడారు. సరిగ్గా ఇదే రోజు మానవ హక్కుల సంఘం నాయకుడు కామ్రేడ్ బాలగోపాల్ వర్ధంతి కావడం యాదృచ్ఛికమే అయినా ఇద్దరు హక్కుల రంగంలో చేసిన కృషి పోరాట స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉంటుందని, నేడు వారి అవసరం ఎంత ఉందో ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయని అన్నారు.

నేడు పౌరహక్కులు భయంకరమైన అణచివేత, హింసకు గురవుతున్నాయని, ఎన్ని ఘటనలు జరిగినా పాలకుల నుండి హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయని, రాజ్యం అంతా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందుకే ధైర్యసాహసాలు కలిగిన ఆర్.వి.కె, బాలగోపాల్ లాంటి వారు లేకపోవడం ప్రజా ఉద్యమాలకు లోటు అని అన్నారు. నేడు ముఖ్యంగా దళిత, గిరిజన, మైనార్టీల హక్కులపై అణచివేత తీవ్రంగా ఉందని, పర్యావరణం, విద్య, ప్రభుత్వ సంస్థల విధ్వంసం జరుగుతోందని, ఎక్కడ ప్రశ్నించినా ప్రశ్నించే గొంతుకలను నిర్బంధిస్తున్న స్థితి దేశవ్యాప్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వి. ప్రకాష్ (తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు) మాట్లాడుతూ.. ఆర్.వి.కె 1977 చివరలో మొదటిసారి ఓపిడిఆర్ లో పరిచయమయ్యారని, తమ కన్నా వయసులో పెద్దవారైనా విద్యార్థులమైన తమతో నాయకుడిగా కాకుండా కార్యకర్తగానే ఉండేవారని తెలిపారు. ఆయనను తమ స్కూటర్ పై హైదరాబాద్ అంతా కార్యక్రమాలకు తీసుకెళ్లిన అనుభవాలు గుర్తొచ్చినప్పుడు ఉత్తేజంగా అనిపిస్తుందని అన్నారు. ఆయన 1943లో తూర్పు గోదావరి జిల్లా పట్టిసీమలో జన్మించి, తల్లిదండ్రులతో బీహార్ రాష్ట్రం జంషెడ్ పూర్ ఉక్కునగరం వెళ్లి అక్కడ ప్రాథమిక విద్య, అనంతరం గుంటూరు హిందూ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారని వివరించారు.

మూడవ నిజనిర్ధారణ కమిటీ శ్రీకాకుళంలో జరిగిన ఎదురుకాల్పులపై నివేదికలో గిరిజనులపై జరిగిన అమానుషకాండలు ప్రజలకు తెలిశాయని అన్నారు. తెలంగాణలో 1948 తర్వాత జరిగిన దురంతాలు అన్నీ ఇన్నీ కావని, ఆ దురంతాలన్నీ బయటికి రావాలంటే కామ్రేడ్ డి.వి రాసిన తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన రెండవ వాల్యూమ్ రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణలో జరిగిన ఆకృత్యాలు బయటికి రాకుండా పోతున్న వైనం చూసి చాలా బాధేస్తుందని అన్నారు. తాను రాసిన తెలంగాణ చరిత్రను నేడు అందరూ, అన్ని గ్రంథాలయాలతో పాటు ఉద్యోగాల కోసం గ్రూపు పరీక్షలు రాసుకునే విద్యార్థులు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారని తెలిపారు.

1972-73 ప్రాంతంలో హక్కుల కోసం ఒక సంఘం పెట్టాలని విప్లవకారులందరూ ఆలోచించి శ్రీశ్రీ అధ్యక్షులుగా, పత్తిపాటి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా సంఘం పెట్టినా ఎంతో కాలం నిలవక రెండుగా చీలి ఏపీసీఎల్సీ గా ఒకటి, ఓపిడిఆర్ గా మరొకటి ఏర్పడినా హక్కుల రంగంలో ఆ రెండు సంస్థల కృషి గణనీయమైనదని అన్నారు. గతంలో ఓపిడిఆర్ పనితీరు ఎక్కడికైతే నిజనిర్ధారణ జరుగుతుందో దానిని బయటికి తెచ్చి సంబంధిత అధికారులకు అందజేసి, అవసరమైతే కోర్టుల దృష్టికి తీసుకెళ్లి హత్యాకాండకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోమని కోరేవారని, నేడు ఒక నిజనిర్ధారణకు పోయి వచ్చి ప్రెస్ కి ఇచ్చి అక్కడే ఆగుతున్నారని విమర్శించారు. కొండ వెంకటరెడ్డి గారు ఓపిడిఆర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో భూమయ్య, కిష్టగౌడుల ఉరిశిక్షను రద్దు చేయించడం కోసం రాత్రికి రాత్రి కోర్టుల చుట్టూ తిరిగి అనేక విధాలుగా వారిని రక్షించుకునే ప్రయత్నం చేశారని, నేడు ఇలాంటి ప్రయత్నాలు జరగడం లేదని అన్నారు.

జి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. హక్కుల రంగంలో కానీ, కమ్యూనిస్టు విప్లవకారుల సంస్థల్లో కానీ ఆర్.వి.కె కృషి, పట్టుదల ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త నేర్చుకోదగినవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల్లో పోలీసుల, గుండాల, ప్రభుత్వ జోక్యం ఎక్కడున్నా అక్కడికి వెళ్లి పట్టుదలతో ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆ ఉద్యమ కార్యకర్తలకు అండగా నిలిచేవారని కొనియాడారు. హైదరాబాద్ జంట నగరాల కార్యదర్శిగా ఓపిడిఆర్ లో పనిచేస్తూనే ప్రతి ఉద్యమంలోకి అవసరాన్ని బట్టి చేరి అంచలంచలుగా ఎదిగి 1985లో ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు.

ఈ సంస్మరణ సమావేశంలో న్యాయవాధి గుర్రం వెంకటరెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం, డిఎస్ఓ పూర్వ ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, న్యాయవాది(డిఎస్ఓ పూర్వ ప్రధాన కార్యదర్శి) జేరిపోతుల పోతుల ఉపేందర్, గోలి కృష్ణ, స్వామిరెడ్డి, జక్కుల నరసింహ, కోటేశ్వరరావు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.