పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు
గర్భిణీలు, బాలింతలకు తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై అవగాహన
మొగుళ్లపల్లి, అక్టోబర్ 6 మన ప్రజావాణి : పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది పడుతుందని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (గ్రేడ్-1) అరుణాదేవి అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని న్యూ ఇస్సిపేట-2 అంగన్‌వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ‘మన అంగన్‌వాడీ.. మన బాధ్యత’ అనే అంశంపై అరుణాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు శిశువుల జీవితంలో తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు అన్ని రకాల పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. బియ్యంతో పాటు చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, చేపలు తదితర పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని వివరించారు.
పిల్లలకు జంక్‌ఫుడ్ అలవాటు చేయకూడదని, భోజనం చేసే సమయంలో సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపించే అలవాటును తల్లిదండ్రులు మానుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న భోజన మెనూ, అందులోని పోషక విలువలపై కూడా తల్లిదండ్రులు, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

సమాజ భాగస్వామ్య విద్యలో భాగంగా కృష్ణ కౌశిక్ అనే బాలుడికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణతో పాటు ప్రాథమిక విద్యకు అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వివరించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులు స్వరూప, జ్యోతి, జమున, రోజా, ఆయా, గర్భిణీలు, బాలింతలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

