📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జనగామ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జనగామ పట్టణంలోని మాంగల్య ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు.

ఒక ఫిర్యాదు వచ్చినప్పటి నుండి కేసు నమోదు, దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, నేరస్తులను పట్టుకోవడం, కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం వరకు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. పోలీస్ స్టేషన్ లో ఉండే వివిధ విభాగాలు, 100 డయల్, పెట్రోలింగ్ వ్యవస్థ, మహిళా భద్రత కోసం షీ టీమ్స్ పనితీరును తెలియజేశారు.

పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు, పరస్పర నమ్మకం, సహకారం ఉండటం చాలా ముఖ్యమని అధికారులు సూచించారు. పోలీసులు ప్రజలకు శత్రువులు కాదు, నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేసే మిత్రులని, ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లు వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.
నేటి డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ పంచుకోవద్దని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని హెచ్చరించారు.
యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితం, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనమవుతుందని, ఎక్కడైనా డ్రగ్స్ అమ్మకాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని అధికారులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనగామ పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.