పెండింగ్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి
కాలువలు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష
దుబ్బాక, అక్టోబర్ 13 (ప్రజావాణి):
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువల నిర్మాణ పనులను, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం దుబ్బాకలోని తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్, చేగుంట, నార్సింగి మండలాలతో పాటు శంకరంపేట కెనాల్ పరిధిలో కాలువల నిర్మాణం, పెండింగ్ పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా మంజూరైన సూరంపల్లి–నాచారం రహదారి, మెట్టు రోడ్డు, దౌల్తాబాద్–తిమ్మాపూర్ రహదారుల అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, జాప్యానికి గల కారణాలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కాలువలు, పెండింగ్లో ఉన్న రహదారుల పనులను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కాలువల నిర్మాణ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
కాలువల నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ భూములకు సంబంధించిన సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, రైతుల సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రహదారుల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశాల్లో ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

