పుట్టపహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల రగడ: ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు
అర్హులైన పేదలను కాదని అనుకూలమైన వారికే కేటాయింపులు: సర్పంచ్ బోయిని అంజిలయ్య
రెండో విడత జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేత
పరిగి: అక్టోబర్ 15,ప్రజా వాణి:
గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇండ్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆనంద్కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని అంజిలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్న నిజమైన నిరుపేదలకు మొండిచేయి చూపి, తమకు అనుకూలమైన వారికే ఇళ్లు మంజూరు చేసుకున్నారని మండిపడ్డారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్కు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా జాబితాలు సిద్ధం చేశారని, ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పుట్టపహాడ్ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, గ్రామానికి మరింత పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం విడుదల చేసిన రెండో విడత జాబితాను వెంటనే రద్దు చేసి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులందరితో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ లాల్ బహుదూర్ శాస్త్రి, వార్డు సభ్యులు జి. శైలజ, సి. అశ్విని, బి. బిక్షపతి, జె. విష్ణువర్ధన్, ఎస్. మారుతి, గ్రామ నాయకులు ఉప్పరి కృష్ణయ్య, ఉప్పరి వెంకటయ్య, గొల్ల మొగులయ్య, రిటైర్డ్ ఆర్మీ జక్కులపల్లి కృష్ణయ్య, జంపల రాములు, సన్రాజ్ శీను, ఉప్పరి వెంకట్ రాములు, గాండ్ల వెంకట్ రాములు, కరిగల్ల నరసింహులు, సంగం నర్సింలు, కాకి రాములు, తమ్మలి యాదయ్య తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

