పుట్టపహడ్, ఘనపూర్ గ్రామాల్లో ఘనంగా ‘భూ భారతి’ భూ సర్వే అవగాహన సదస్సులు.
పరిగి/కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 24:
గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరియు రైతుల భూములకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ భూ సర్వే కార్యక్రమంపై శనివారం పుట్టపహడ్ మరియు ఘనపూర్ గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు.
పుట్టపహడ్ గ్రామ సదస్సు:
పుట్టపహడ్ గ్రామంలో జరిగిన అవగాహన సదస్సుకు గ్రామ సర్పంచ్ అంజిలయ్య అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఉప తాసిల్దార్ చంద్రశేఖర్, మండల గిర్ధావరి కే రవీందర్ చారి, జీపీవో స్వప్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరిగే భూ భారతి సర్వే ద్వారా ప్రతి గుంట భూమికి పక్కా హద్దులు నిర్ణయించడం జరుగుతుందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, రైతులు తమ భూముల వివరాలను సరిచూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోపంచాయతీ కార్యదర్శి భాస్కర్,ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి,వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.అదేవిదంగా
ఘనపూర్ గ్రామంలో జరిగిన అవగాహన సదస్సుకు గ్రామ సర్పంచ్ రవీందర్ పవార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాఘవేందర్ గౌడ్, మండల గిరిధర్ రవీందర్ చారి, మండల సర్వేయర్ శ్రీహరి, జీపీవోలు ప్రవీణ్, నర్సింలు, పంచాయతీ కార్యదర్శి మౌనిక, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే విధానం, భూ యజమానుల హక్కులు, మరియు సర్వే ద్వారా చేకూరే ప్రయోజనాలపై గ్రామస్తులకు అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.
రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకోవాలని, సర్వే బృందాలకు సహకరించి తమ భూముల హద్దులను పక్కాగా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ అవగాహన సదస్సుల ద్వారా గ్రామాల్లో భూ సర్వే ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన లభించిందని, త్వరలోనే క్షేత్రస్థాయి సర్వే పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

