📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పాలారం మేజర్ కాలువపై అధికారుల చిన్నచూపు

పాలారం మేజర్ కాలువపై అధికారుల చిన్నచూపు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి అనంతగిరి

పాలారం మేజర్ కాలువపై అధికారుల చిన్నచూపు!

పక్క కాలువకు నిరంతర నీటి ప్రవాహం.. 14బి కెనాల్‌ రైతులకు మాత్రం ఇబ్బందులా?

కాలువల రీ-డిజైన్‌ చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని రైతుల విజ్ఞప్తి

సాగర్‌ కాలువకు అనుసంధానంగా ఉన్న అనంతగిరి మండలం పాలారం మేజర్‌ కాలువ, 14బి కెనాల్‌ విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఇదే తరహాలో ఉన్న మరో కాలువలో నిరంతరంగా నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, పాలారం 14బి కెనాల్‌ పరిధిలోని రైతులకు సాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే సాగునీటి వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న కాలువల మధ్య నీటి సరఫరాలో వ్యత్యాసం ఎందుకు ఉంటోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాలారం మేజర్‌ కాలువతో పాటు 14బి కెనాల్‌ పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను గుర్తించాలని కోరుతున్నారు. కాలువల ప్రస్తుత నిర్మాణం, నీటి ప్రవాహ సామర్థ్యం, నీటి పంపిణీ విధానాన్ని సమీక్షించి అవసరమైన చోట పునఃరూపకల్పన మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సాగునీరు పంటలకు అవసరమైన సమయంలో అందకపోతే రైతులు పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. మరో కాలువలో నీటి సరఫరా కొనసాగుతున్నప్పుడు, తమ కాలువలో ఎదురవుతున్న సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాలారం మేజర్‌ కాలువ, 14బి కెనాల్‌ను పరిశీలించి నీటి సరఫరాలో వ్యత్యాసానికి గల కారణాలను గుర్తించాలని రైతులు కోరుతున్నారు. అవసరమైన సాంకేతిక సర్వే నిర్వహించి, కాలువల రీ-డిజైన్‌, పూడికతీత, మరమ్మతులు, నీటి పంపిణీ వ్యవస్థలో మార్పులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల పట్ల వివక్ష ఉందనే భావన కలగకుండా అన్ని ఆయకట్టు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యంతో సాగునీరు అందించాలి. సమస్యను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిష్కరించి, పంటలకు సకాలంలో నీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పాలారం రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.