📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే.. అందరిదీ కేసీఆర్ గ్రూపే

పార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే.. అందరిదీ కేసీఆర్ గ్రూపే

📰 Generate e-Paper Clip

పార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే.. అందరిదీ కేసీఆర్ గ్రూపే..!

వ్యక్తిగత విభేదాలు వీడి పార్టీ విజయానికి పనిచేయండి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల ముఖ్య సమీక్షా సమావేశం

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కీలకం – ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పల్లా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జనగామ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి , స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇది సాధారణ ఎన్నిక కాదు. ప్రతి గ్రామంలో అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలి. దరఖాస్తుల సమర్పణతో సరిపెట్టొద్దు.. ఆమోదం పొందే వరకు పర్యవేక్షించాలి.

2015లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం విజయం సాధించాం. 2021 ఎన్నికల సమయంలో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేశారు. గ్రామాల్లో గ్రాడ్యుయేట్లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి ద్వారా ఇతరులపై కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికను సాధారణంగా తీసుకోకుండా పూర్తిస్థాయిలో కృషి చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, కర్ణాటకలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను గుర్తుచేస్తే ఎన్నికల్లో విజయాలు రాజకీయంగా ఎంత కీలకమో అర్థమవుతుంది. ప్రతి ఎన్నికను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత అవసరం” అని అన్నారు.
“ఓటరు నమోదు కార్యక్రమం పురోగతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా ఆరా తీశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో నాకు ఫోన్ చేసి, ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లను నమోదు చేయించారు, ఎంత పని పూర్తయింది అని వివరాలు అడిగారు. అంటే ఈ ఎన్నికను అధినేత ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవలన్నారు

ఈ నేపథ్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలను సంప్రదించడంతో పాటు సంబంధిత అధికారులను కలిసి ఓటరు నమోదుకు సహకరించాలని కోరాం. పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, గ్రామాల్లో గ్రాడ్యుయేట్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించి, వారితో దరఖాస్తులు చేయించాలి” అని వివరించారు.

“పార్టీలో వేర్వేరు వర్గాలు లేవు, అందరిదీ కేసీఆర్ గ్రూపు, బీఆర్ఎస్ గ్రూపు మాత్రమే. వ్యక్తిగత ప్రాధాన్యాలు, విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయం లక్ష్యంగా పనిచేయాలి. ప్రతి గ్రామానికి కోఆర్డినేటర్లను నియమించి బాధ్యతలు అప్పగించాలి, ఇతరులు పనిచేస్తారనే ఉద్దేశంతో ఎవరూ తమ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని,
ఎవరు ఎంతమందిని ఓటర్లుగా నమోదు చేయించారనే దానికంటే, అర్హులైన వారందరినీ గుర్తించి నమోదు ప్రక్రియను పూర్తి చేయించడమే ముఖ్యం. ఒకరు చేయలేదని మరొకరిపై నిందలు వేయకుండా, తమకు అప్పగించిన పనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలి. పార్టీకి అనుకూలంగా ఉన్నవారితో పాటు తటస్థంగా ఉన్న అర్హులైన గ్రాడ్యుయేట్లను కూడా గుర్తించి ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి” అని పిలుపునిచ్చారు.
“ఓటరు నమోదుకు డిగ్రీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులు కోరిన పత్రాలను సమర్పించి, తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
దరఖాస్తు చేయించడం 50 శాతం పనైతే, దానికి ఆమోదం పొందడం మిగిలిన 50 శాతం పనిగా భావించాలి. దరఖాస్తు సమర్పించినంత మాత్రాన ఓటరు నమోదు పూర్తయినట్లు కాదు, ఆమోదం లభించే వరకు పర్యవేక్షించాలి” అని స్పష్టం చేశారు

“ప్రతి గ్రామంలో ఎంతమంది దరఖాస్తు చేశారో, ఎంతమందికి ఆమోదం లభించిందో వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేయాలి. గ్రామాలవారీగా ఓటర్ల పేర్లు, అవసరమైన గుర్తింపు వివరాలు, సంప్రదింపు వివరాలను సేకరించి ఎన్నికల ఇన్‌చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు కి అందించాలన్నారు. ఎంతమంది నమోదు అయ్యారనే విషయంలో స్పష్టమైన లెక్కలు ఉండాలి” అని సూచించారు.
“రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రఘునాథపల్లి మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో కార్మికులు తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు” అని విమర్శించారు.
“ఈ నెల 30, 31 తేదీల్లోగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా కృషి చేయాలి, నవంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తుల ఆమోదంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలో రోజుకు గంట లేదా రెండు గంటలు కేటాయించి గ్రాడ్యుయేట్లను గుర్తించడం, దరఖాస్తులు చేయించడం, వాటికి ఆమోదం పొందే వరకు పర్యవేక్షించడం వంటి పనులను సమన్వయంతో చేపట్టాలి.

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికను కీలకంగా తీసుకోవాలి, ఎన్నికలో విజయం సాధించేందుకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.