📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపదవులన్నీ అనుభవించి వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు కడియం

పదవులన్నీ అనుభవించి వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు కడియం

📰 Generate e-Paper Clip

పదవులన్నీ అనుభవించి వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు కడియం

బెదిరిస్తే ఊరుకునేది లేదు బిడ్డా.. నీ బెదిరింపులకు భయపడేది లేదు..!

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవులన్నీ అనుభవించి వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు కడియం.. గులాబీ జెండా అండతో ఎదిగి నేడు మా గులాబీ బిడ్డలనే బెదిరిస్తావా? గులాబీ జెండా కోసం కష్టపడిన కార్యకర్తలే నాయకులను గెలిపించారు. గెలిచిన మా గులాబీ బిడ్డలను బెదిరిస్తే ఊరుకునేది లేదు బిడ్డా.. నీ బెదిరింపులకు భయపడేది లేదు..! అంటూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ రాజకీయాలపై కడియం శ్రీహరి తీరుపై పల్లా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం వేలేరు మండలంలోని సోడాశపల్లి గ్రామంలో పల్లా నివాసం వద్ద వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ
కేసీఆర్ నాయకత్వంలో అన్ని పదవులు అనుభవించి, రాజకీయంగా గుర్తింపు పొందిన కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి గెలుపు కోసం తాటికొండ రాజయ్య, తాను కలిసి పనిచేశామని పల్లా గుర్తుచేశారు. ఆయనకు రాజకీయంగా గుర్తింపు రావడం వెనుక గులాబీ పార్టీ శ్రేణుల కృషి ఎంతో ఉందన్నారు. గులాబీ జెండా కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలే నాయకులను గెలిపించారని పేర్కొన్నారు.

“ఒకప్పుడు గులాబీ జెండా అండతో పదవులు పొంది, రాజకీయంగా ఎదిగిన నాయకుడివి నువ్వు.. నేడు మా నాయకులను బెదిరిస్తున్నావా? పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల శ్రమను మరిచిపోయావా?” అంటూ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని, రాజకీయాల్లో వ్యక్తిగత ఆధిపత్య ధోరణులకు తావివ్వకూడదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ రాజకీయాల విషయంలో కడియం శ్రీహరి అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల గౌరవం, బీఆర్ఎస్ బలోపేతమే ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో పనిచేసి ఎన్నికల్లో విజయాలు సాధించామని పల్లా గుర్తుచేశారు. వరంగల్ ప్రాంతంలో గులాబీ జెండాకు బలమైన పునాది ఉందని, గతంలో నిర్వహించిన సభలు, ఎన్నికల్లో సాధించిన విజయాలు పార్టీ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. చిల్పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ తదితర మండలాల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌కు మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో పదవులు పొందిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కృషిని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి పలు పనులు చేపట్టామని పల్లా గుర్తుచేశారు. చిల్పూర్, ధర్మసాగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో టన్నెల్స్, కాలువల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సాగునీరు, విద్యుత్, రైతుబంధు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
పార్టీలో వేర్వేరు వర్గాలు లేవని, మనందరిదీ కేసీఆర్ గ్రూపు, బీఆర్ఎస్ గ్రూపు మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ ఐక్యత, బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పల్లా పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు నమోదు విషయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ఎదుర్కోవాలని సూచించారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి విజయాలు సాధించారని గుర్తుచేశారు.
“నేను ఎప్పటికీ జనగామలోనే ఉంటా.. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటా. కార్యకర్తల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాను. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా సమష్టిగా పనిచేయాలి. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో, గులాబీ జెండా విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలి” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.

ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.