జమ్మికుంటలోఓ ప్రైవేటువైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడి మృతి
* ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని కార్తికేయ ఆసుపత్రికి తరలించారు
జమ్మికుంటఅక్టోబర్ 16 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేటువైద్యుల నిర్లక్ష్యం మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ ఒక కుమారుడు పోలీసులను ఆశ్రయించిన ఘటన జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి కి చెందిన కొక్కుల శివకృష్ణ అందించిన ఫిర్యాదు ప్రకారం తన తండ్రి కొక్కుల సమ్మయ్య (60) గత పది రోజుల క్రితం స్థానిక ఎస్బీఐ ఏటీఎం వద్ద మెట్లు జారి కింద పడటంతో కుడి కాలుకి ఫ్రాక్చర్ అయింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని కార్తికేయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రమేష్ అనే వ్యక్తి సలహా మేరకు డాక్టర్ శరత్ బాబు సమ్మయ్యకు పరీక్షలు నిర్వహించి కాలుకు పట్టీ వేసి పంపించారు. ఆరు రోజుల తర్వాత మరోసారి ఆసుపత్రికి వెళ్లగా మందులు ఇచ్చి పంపగా, ఈ నెల 15న సమ్మయ్యను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.సమ్మయ్యను పరీక్షించిన డాక్టర్ శరత్ కాలు వాపు తగ్గలేదని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలని రక్త పరీక్షలకు నమూనాలు సేకరించారు. రక్త పరీక్షల నివేదిక వచ్చే వరకు పట్టీ వేయవద్దని రెండు రోజుల తర్వాత వేద్దామని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ డాక్టర్ వినలేదు. బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇవ్వాలని సూచించారు. డాక్టర్ ఆదేశాల మేరకు రమేష్, అతని సహాయకుడు కలిసి టజేటర్ 4.5యూపెంట 40 ఎంజీ’ అనే మూడు డోసుల ఇంజెక్షన్లను ఐదు నిమిషాల వ్యవధిలోనే సమ్మయ్య కుడి చేతికి ఇచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే సమ్మయ్య ఆకస్మాత్తుగా లేచి శ్వాస ఆడటం లేదని ఒళ్లు వణుకుతోందని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు వెంటనే డాక్టర్ శరత్ మరో రెండు ఇంజెక్షన్లు ఇచ్చి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమ్మయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే హనుమకొండలోని మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు బాధితుడిని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హనుమకొండ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు సమ్మయ్య మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు.డాక్టర్ శరత్ బాబు తీవ్ర నిర్లక్ష్యంతో పాటు మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే తన తండ్రి చనిపోయాడని శివకృష్ణ పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సమగ్ర విచారణ చేపడుతున్నారు
