*జనగామ గడ్డ పోరాటాలకు నిలయం – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి*
*జనగామ గడ్డ పోరాటాలకు నిలయం*
*సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాట పంథా కొనసాగాలి*
*పాపన్న చరిత్రను భవిష్యత్ తరాలకు చాటిచెప్పాలి*
*జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టాలి*
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జనగామ గడ్డ పోరాటాలకు నిలయమని, ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
జిల్లా లోని బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… సర్దార్ సర్వాయి పాపన్న సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అన్ని వర్గాలను ఏకం చేసి సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీశాలని, పాపన్న ఒక్క సామాజిక వర్గానికే కాదు, బహుజనులందరికీ స్ఫూర్తి అని అన్నారు.
జనగామ జిల్లాలోని ప్రతి గ్రామానికి పోరాట చరిత్ర ఉందని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ వంటి మహనీయులు ఈ నేల నుంచే పోరాట స్ఫూర్తిని చాటారని, వేలాది మంది అమరుల త్యాగాల ఫలితంగా భూమి పంపిణీ జరిగిందని గుర్తుచేశారు.
గత పాలకులు అనేక పోరాటాల చరిత్రను, 1969 తెలంగాణ విద్యార్థుల పోరాట చరిత్రను మరుగునపరిచారని, వాస్తవ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ సోదరులకు ఉపాధి కల్పించేలా కల్లు దుకాణాలను పునరుద్ధరించామని, ప్రమాద పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని, ఎక్సైజ్ శాఖ వ్యాపారాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. గౌడ సోదరుల కల్లు సొసైటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, అసెంబ్లీలో గళం విప్పుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

