📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచిరు వ్యాపారుల అడ్డాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం

చిరు వ్యాపారుల అడ్డాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

చిరు వ్యాపారుల అడ్డాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం

హైకోర్టు స్టేను గౌరవించి అధికారులు సహకరించాలి: చందుపట్ల కీర్తిరెడ్డి

భూపాలపల్లి, అక్టోబర్ 6 మన ప్రజావాణి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో చిరు వ్యాపారుల అడ్డాలను భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసిన ప్రదేశంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు, స్టే ప్రకారం అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు.

2014లో భూపాలపల్లి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గతంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో ప్రైవేట్ స్థలాల వ్యక్తులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు దండుకుంటూ విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి స్థలాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేద చిరు వ్యాపారుల అడ్డాలను దౌర్జన్యంగా తొలగిస్తున్నారని విమర్శించారు.

ఎలాంటి రూట్ మ్యాప్ లేకుండా రోడ్ల అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులపై అధికారులు అవినీతికి పాల్పడుతూ, దాడులకు దిగుతూ నిరుపేదల ఇళ్లు, అడ్డాలను బలవంతంగా తొలగిస్తున్నారని కీర్తిరెడ్డి ఆరోపించారు. గత మూడు రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రజలపై ఉక్కుపాదం మోపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

అయినప్పటికీ బీజేపీ, బీఎంఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అఖిలపక్ష చిరు వ్యాపారులు ఏకమై నిరాహార దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎలాంటి రూట్ మ్యాప్, కలెక్టర్ ఆదేశాలు లేకుండా మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, పోలీసు యంత్రాంగం మూకుమ్మడిగా చిరు వ్యాపారులపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

భూపాలపల్లిలో జరుగుతున్న ఈ దమనకాండను పూర్తిగా ఖండిస్తున్నానని కీర్తిరెడ్డి తెలిపారు. అడ్డాలు కోల్పోయిన నిరుపేద చిరు వ్యాపారులకు బీజేపీ అండగా ఉంటుందని, పునరావాసం కల్పించే వరకు వారి పోరాటంలో ముందుండి ఎంతటికైనా పోరాడుతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నిశిధర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి సి. దశమంతరెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, జన్నె మొగిలి, దొంగల రాజేందర్, గీస సంపత్‌కుమార్, అర్బన్ అధ్యక్షుడు బట్టు రవి, ఎరకల గణపతి, మీనం తిరుపతి, గట్ల శ్రీను, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.