గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి..
CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు
గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న ఆన్లైన్లో నమోదు కాని కార్మికులకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై యూనియన్ ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన అనంతరం, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జనగామ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో ) వెంకట్ రెడ్డి కి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీపీవో వెంకట్ రెడ్డి స్పందించి, పెండింగ్లో ఉన్న వేతనాలు గల గ్రామపంచాయతీ కార్మికులకు తక్షణమే అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, మురుగుకాలువల శుభ్రత తదితర పనులను నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ, దసరా వంటి పండుగల సమయంలో కూడా వేతనాలు అందక కార్మిక కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల ఇళ్లలోనే పండుగల వెలుగులు లేకపోవడం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశమని పేర్కొన్నారు.
ఆన్లైన్లో పేర్లు నమోదు కాలేదనే కారణంతో ఇప్పటికే పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు నిలిపివేయడం సరైంది కాదన్నారు. కార్మికులు పనిచేస్తున్న వాస్తవ పరిస్థితులను, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి, వారి వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను విడుదల చేయడంతోపాటు భవిష్యత్తులో ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించి, ఆన్లైన్ నమోదు సమస్యను పరిష్కరించకపోతే కార్మికుల హక్కుల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాపర్తి రాజు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) జిల్లా వివిధ మండలాల నాయకులు ఉమ్మగొని రాజేష్, పగిడిపల్లి మల్లేష్, ఎన్. రాజయ్య, యాకసా జిల్లా ఉపాధ్యక్షులు గంగాపురం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
