*గోదావరిలో ఇసుక మాఫియా స్వైరవిహారం*
—-వీడీసీల పేరుతో లక్షల రూపాయల దోపిడీ
*రాయికల్, అక్టోబర్ 29 (ప్రజావాణి):*
రాయికల్ మండలంలోని గోదావరి తీరం దోపిడీకి గురవుతోంది. జగన్నాథ్ పూర్, బోర్నపల్లి, ఇటిక్యాల, కొత్తపేట, మూటపల్లి, రామారావు పల్లె గ్రామాల పరిధిలో రాత్రికి రాత్రే వందల ట్రాక్టర్ల, టిప్పర్లు,లారీల ద్వారా ఇసుక మాయమైపోతోంది.గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన గ్రామ అభివృద్ధి సంఘాల (వీడీసీల) పేరుతోనే దందా సాగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామాల్లో వీడీసీల పెత్తనంతో ఇసుకను అక్రమంగా టెండర్లు వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. గుత్తేదారులు నిబంధనలను తుంగలో తొక్కి, అనుమతులకు మించి, యంత్రాలతో లోతుగా తవ్వేస్తున్నారు.ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోంది. గ్రామ అభివృద్ధికి రావాల్సిన నిధులు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి.గోదావరిని లోతుగా తవ్వేయడం వల్ల పరివాహక ప్రాంతం అంతా గుంతలమయమైంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రాత్రిపూట నిఘా పెట్టి, ఈ ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

