కోతుల బెడద భయాందోళనలొ ప్రజలు
గోవిందరావుపేట(ప్రజావాణి)
మండలంలోని పసర గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, నివాస ప్రాంతాల్లో మకాం వేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా కోతుల దాడుల్లో పలువురు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇళ్లలోకి చొరబడి హల్చల్..
కోతులు ఇళ్లలోకి సులభంగా చొరబడి వంటగదుల్లోని ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అన్నం గిన్నెలు, పప్పు డబ్బాలు, ఇతర ఆహార పదార్థాలను తీసుకెళ్లడంతోపాటు బియ్యం సంచులను చింపి బియ్యాన్ని చిందరవందరగా పడేస్తున్నాయని చెబుతున్నారు. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచేందుకు కూడా భయపడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు.
కర్రలు పట్టుకుని బయటకు..
కోతుల గుంపులు రోడ్లపై, ఇళ్ల సమీపంలో సంచరిస్తుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కర్రలు చేతబట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎప్పుడు కోతులు దాడి చేస్తాయోనన్న ఆందోళనతో పిల్లలను ఒంటరిగా బయటకు పంపడం లేదని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు?
కోతుల బెడదను నియంత్రించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల సంఖ్య పెరుగుతున్నా వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతోందని అంటున్నారు.
ముఖ్యంగా 11,12 వార్డు లలో అధిక సంఖ్యలో కోతుల సంచారం నెలకొన్న పట్టించుకోని వార్డు సభ్యులను ఎందుకు గెలిపించామని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హమీల ప్రకారం కోతుల బెడద నుండి విముక్తి చేయలాని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

