*కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
సింగరేణి సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలలో వాస్తవ లాభాలు ప్రకటించి, 40 శాతం లాభాల వాటాను కార్మికులకు పంపిణీ చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికేఎస్) ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏరియాలోని కాసీపేట 2 గని నాయకుడు సారంగపాణి లు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఏరియాలోని అన్ని గనులు విభాగాలలో నిరసన కార్యక్రమం నిర్వహించి, సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లు నిర్వహించిన కార్యక్రమానికి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ ముఖ్యఅతిథిగా హాజరై, వర్క్ షాప్ ఎస్ఈ నరేష్ కు వినతిపత్రం అందజేయ,గా కాసీపేట 2 గనిపై యూనియన్ నాయకుడు సారంగపాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, గని మేనేజర్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రాణాలు ఫణంగా పెట్టి సింగరేణి కార్మికులు గత సంవత్సరం సాధించిన లాభాల వివరాలను తక్షణమే వెల్లడించాలని, ప్రకటించే లాభాలలో ఎలాంటి కోతలు పెట్టకుండా నికర లాభాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు గత సంవత్సరం లెక్కలు చెప్పకపోవడం సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. దసరా పండుగలోపు లాభాల వాటాను చెల్లించడం సాంప్రదాయంగా కొనసాగుతోందని, మరో పక్షం రోజుల్లో దసరా పండుగ ఉన్నందున తక్షణమే సింగరేణి సంస్థ సాధించిన లాభాలను ప్రకటించి, 40 శాతం లాభాల వాటాను కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు చొరవ చూపి ముఖ్యమంత్రితో సంప్రదించాలని సూచించారు. సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా చెప్పుకునే ఏఐటీయూసీ, ఐఎన్టియుసి నాయకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గనుల విభాగాల పిట్ కార్యదర్శులు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు, కేంద్ర నాయకులు, ఏరియా నాయకులు, బ్రాంచ్ నాయకులు, టిబిజికేఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

