కబడ్డీలో సత్తా చాటిన చొక్కా వైశాలి
◦ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
అశ్వారావుపేట, అక్టోబర్ 28 (మన సమగ్ర ప్రజావాణి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన చొక్కా వైశాలి కబడ్డీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. పెనుబల్లి మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్న వైశాలి, ఇటీవల ఖమ్మంలో జరిగిన పీఎం శ్రీ (PM SHRI) జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. మొత్తం 40 జట్లు హోరాహోరీగా తలపడిన ఈ టోర్నమెంట్‌లో వైశాలి ప్రాతినిధ్యం వహించిన జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విజయం అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి చేతుల మీదుగా ఆమె జట్టు ట్రోఫీని అందుకుంది. జిల్లా స్థాయిలో సత్తా చాటిన వైశాలి, నవంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం విశేషం. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వైశాలి తండ్రి చర్చ్ పాస్టర్‌గా సేవలందిస్తుండగా, తల్లి గృహిణిగా ఉన్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లలో వైశాలి చిన్నది కావడం గమనార్హం. ఇటీవలే ఈమె పెద్ద అక్క చొక్కా వాసంతికి ఎంబీబీఎస్ సీటు లభించగా, ఇప్పుడు వైశాలి క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆ కుటుంబంలో రెట్టింపు ఆనందాన్ని నింపింది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో చదువుతో పాటు క్రీడల్లోనూ దూసుకెళ్తున్న వైశాలి, తన పట్టుదలతో తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. వైశాలి సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తెవాలని ఆకాంక్షించారు.
