*ఓ యువతా.. మేలుకో! మత్తు కాదు.. నీ భవితే ముఖ్యం!*
రాయికల్; అక్టోబర్ 25(ప్రజావాణి)
నేటి యువత చేతిలో పుస్తకాలు ఉండాల్సిన చోట మద్యం సీసాలు, కళ్ళలో కలలు ఉండాల్సిన చోట నిషా కనిపించడం సమాజం ఎంతగా దిగజారిపోయిందో చెబుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ చేయాలని కలలు కనేవారు, కానీ నేడు పద్దెనిమిదేళ్లు నిండకముందే మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం, రాత్రంతా పబ్బుల్లో జల్సాలు చేయడం, బైకులపై రాష్ డ్రైవింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. స్నేహం పేరుతో మొదలైన ఈ అలవాటు నెమ్మదిగా వ్యసనంగా మారి వారి బంగారు భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తోంది. దీనికి ప్రధాన కారణం చేతిలోకి త్వరగా వచ్చే డబ్బు, అదుపులేని స్వేచ్ఛ, సోషల్ మీడియాలో కనిపించే విచ్చలవిడి జీవితాలు. సినిమాల్లో హీరోలు మద్యం తాగితే హీరోయిజం అనుకుంటున్నారు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో బీర్ బాటిల్ తో వీడియో పెడితే లైకులు వస్తాయని భ్రమపడుతున్నారు. ఒక్కసారి మద్యానికి అలవాటు పడితే చదువుపై ఏకాగ్రత పూర్తిగా పోతుంది, తల్లిదండ్రుల మాట లెక్కచేయరు, ఆ మత్తు కోసం డబ్బు కోసం చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి ఆ తర్వాత పెద్ద నేరాలకు కూడా తెగిస్తున్నారు. మద్యం మత్తులో జరిగే బైక్ ప్రమాదాల్లో ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. యువత అంటేనే దేశానికి వెన్నెముక లాంటి వారు, వారి రక్తంలో ఉన్న వేడిని దేశ అభివృద్ధి కోసం, సమాజ మార్పు కోసం వాడాలి, కానీ అదే వేడిని మద్యంలో, గంజాయిలో, జల్సాల్లో చల్లార్చుకుంటే నష్టపోయేది వారి కుటుంబమే కాదు యావత్ సమాజమే. ఇరవై ఐదేళ్లకే లివర్ పాడై, కిడ్నీలు దెబ్బతిని ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తోంది. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ఆస్తిని, పిల్లల చదువుల కోసం దాచిన డబ్బును ఈ మద్యం మహమ్మారి తాగేస్తోంది. దీని నుండి బయటపడాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలతో రోజూ కాసేపు ప్రేమగా మాట్లాడాలి, వారు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని గమనించాలి, ప్రభుత్వాలు బెల్ట్ షాపులను, యువతకు అందుబాటులో ఉండే మద్యం దుకాణాలను కట్టడి చేయాలి, యువత తమ ఖాళీ సమయాన్ని క్రీడలకు, పుస్తకాలకు, సేవా కార్యక్రమాలకు కేటాయించాలి. గుర్తుపెట్టుకోండి మద్యం తాగడం ఒక్క క్షణం జల్సా ఇస్తుంది, కానీ మీ బంగారు భవిష్యత్తును జీవితాంతం చీకటిలోకి నెట్టేస్తుంది, మేలుకునే సమయం ఇదే.

