ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అక్టోబర్ 16 మన ప్రజావాణి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్) ఆవరణలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఐడీఓసీ ఆవరణలో వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా అధికారులు, ఉద్యోగులు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కోలాటాలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలతో ఐడీఓసీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతిని, పూలను, మహిళలను గౌరవించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు.అనంతరం ఉత్తమంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి, వాటి నిర్వాహకులకు జ్ఞాపికలను అందజేశారు
.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, యువజన క్రీడల శాఖ అధికారి రఘు, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఆర్డీఓ బాలకృష్ణ, సీపీఓ క్రిష్ణయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి షఫీ సర్కార్, జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, కార్యదర్శి దసరథంతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

