ఉత్తుత్తి మాటలకే పరిమితమైన ప్రభుత్వ కట్టడి
మంచిర్యాల, అక్టోబర్ 22, ప్రజావాణి:
“అన్నదాత సుఖీభవ” అన్నాం.. “ప్రజల సంక్షేమమే మా ధ్యేయం” అన్నాం.. కానీ రోజువారీ కూలీ చేసుకునే పేదోడి బతుకంతా ఇప్పుడు నిత్యావసరాల ధరల మంటలో మాడిపోతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల మాటున, ‘ఎల్ నినో’ అనే రెండక్షరాల పదాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు వ్యాపార వర్గాలు. అన్నం పెట్టే బియ్యం నుంచి.. పోపుల డబ్బాలో పప్పుల వరకు ప్రతి దానిపై దోపిడీ దారుణంగా పెరిగింది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఈ దళారీ దోపిడీని అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది.
*బియ్యం ధరలకు రెక్కలు.. పేదోడి గుండెల్లో రైళ్లు!*
తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. సాధారణ రకం సోనా మసూరి మొదలుకుని, నాణ్యమైన బాస్మతి రకాల వరకు ప్రతి క్వింటాపై కిందటేడాదితో పోలిస్తే రూ. 500 నుండి రూ. 800 వరకు అదనంగా భారం పడింది. కేజీ రూ. 45-50 ఉన్న సాధారణ బియ్యం ధర ఇపుడు బహిరంగ మార్కెట్లో కిలో కు రూ. 95 దాటిపోయింది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిందనే సాకుతో మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. గోదాముల్లో నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ధరలను అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.
మండిపోతున్న నిత్యావసరాలు
బియ్యం మాత్రమే కాదు వంటగదిలోని ప్రతి నిత్యావస వస్తువు ధర భగ్గుమంటోంది. కందిపప్పు, మినప్పప్పు ధరలు కిలో రూ. 180 నుంచి రూ. 200 వరకు పలుకుతున్నాయి.వంట నూనెలు, చింతపండు, ఉప్పు, కారం సహా అన్నింటి ధరలూ సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయల ధరలు ఇప్పటికే కొండెక్కి కూర్చోగా, ఇప్పుడు పప్పు దినుసులు కూడా దూరమవుతుండటంతో పేదవాడు పూట గడవడం ఎలాగని కన్నీరు పెట్టుకుంటున్నాడు.
*ప్రభుత్వ జోక్యం శూన్యం.. చోద్యం చూస్తున్న యంత్రాంగం*
ధరలు ఆకాశాంటుతున్నా.. మార్కెట్‌ను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ యంత్రాంగం నిద్రమత్తు వీడడం లేదు. ఎల్ నినో ప్రభావం ఉందంటూ వ్యాపారులు చేస్తున్న అక్రమ నిల్వలు (హోర్డింగ్), బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. తనిఖీలు నామమాత్రంగానే సాగుతుండటంతో బడా వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. “మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి” అంటూ ప్రభుత్వ పెద్దలు చేతులు దులుపుకుంటున్నారే తప్ప, సామాన్యుడికి సబ్సిడీ ధరలపై నిత్యావసరాలు అందించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలూ కనిపించడం లేదు.కరువు వస్తదో, ఎల్ నినో వస్తదో పేదోడికి తెలియదు. కానీ వాడికి కావాల్సిందల్లా రెడూ పూటలా కడుపు నిండా అన్నం. వ్యాపారుల కృత్రిమ కొరతను, దోపిడీని కట్టడి చేయడంలో ప్రభుత్వం ఇలాగే మీమాసలో ఉంటే.. ప్రజా ఆగ్రహం చవిచూడక తప్పదు. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి, హోల్‌సేల్ మార్కెట్లు, గోదాములపై ఉక్కుపాదం మోపి, ధరలను అదుపులోకి తేవాలని ప్రజలు ఆవేదనతో కోరుతున్నారు.

