*ఆరుట్ల సర్పంచ్‌కు అవమానమా?*
*జాతర సమీక్ష సమావేశానికి సమాచారం ఇవ్వకపోవడంపై అఖిలపక్షం ఆగ్రహం*
*గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం.. సర్పంచ్‌కు గౌరవం ఇవ్వాలని డిమాండ్*
మంచాల, అక్టోబర్ 29 (ప్రజావాణి):
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆరుట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈ సమావేశంలో పలువురు గ్రామపెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం
ఈ సందర్భంగా పలువురు గ్రామపెద్దలు మాట్లాడుతూ ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉందని, ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. గతంలో జాతర ఏర్పాట్లను గ్రామ సర్పంచ్, పాలకమండలి సభ్యులతో చర్చించి, దేవాలయ సన్నిధిలోనే సమీక్ష సమావేశాలు నిర్వహించేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం గ్రామంలో జరిగే జాతర ఏర్పాట్లపై ఇబ్రహీంపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు.
గ్రామ ప్రజల ఓట్లతో ఎన్నికైన సర్పంచ్‌కు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్టీ మహిళ సర్పంచ్‌గా కొనసాగుతున్నందునే ఆమెను విస్మరిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు సర్పంచ్‌గా ఉంటే ఇదే విధంగా వ్యవహరించేవారా? నిలదీశారు తదితరులు.

