📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి పరిమళం - ఫ్రెస్నోలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి పరిమళం – ఫ్రెస్నోలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి పరిమళం – ఫ్రెస్నోలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 17(ప్రజావాణి): తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ, పూల పండుగ అయిన బతుకమ్మ వేడుకలు అమెరికా నేలపై అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఫ్రెస్నో నగరంలో ఉన్న శ్రీకృష్ణ బృందావన మందిరం (హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో) ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ సామాజిక సేవకురాలు, WETA ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్మన్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి విచ్చేసి, వేడుకలను ప్రారంభించారు.

అమెరికాలో స్థిరపడిన తెలుగు మహిళలు వందలాదిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పట్టు చీరలు, లంగా ఓణీలలో ముస్తాబై వచ్చారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలతో 7 అంతస్తుల్లో అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ చుట్టూ వలయంగా చేరి.
_బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.._
అంటూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కోలాటం ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు సైతం సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ
“తెలంగాణ సంస్కృతికి, మహిళా శక్తికి ప్రతీక బతుకమ్మ. మనం ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మన మూలాలను మరచిపోకూడదు. అమెరికాలో ఉంటూ కూడా మన పిల్లలకు మన పండుగల గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఇంత చక్కగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న ఫ్రెస్నో ఆలయ కమిటీకి, తెలుగు సంఘం సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.

ప్రవాస ప్రాంతాల్లో ఇలాంటి వేడుకలు మన తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయి. WETA ఫౌండేషన్ తరఫున ఎల్లప్పుడూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు అండగా ఉంటాము” అని అన్నారు.

విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని పరిచయం చేసేలా ఇలాంటి వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకలు కేవలం పండుగ మాత్రమే కాదు, తెలుగు ప్రజల మధ్య ఐక్యతను, సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పే వారధిగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఫ్రెస్నో తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు, WETA ఫౌండేషన్ సభ్యులు, వందలాది మంది తెలుగు కుటుంబాలు పాల్గొన్నారు. చివరగా మహిళలందరికీ బతుకమ్మ ప్రసాదం, పండ్లు పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.