📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaస్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు

📰 Generate e-Paper Clip

ఎన్సిఎపి వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో కేటగిరీ–3లో 2వ ర్యాంక్

అవార్డుతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సిఎపి)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026 లో దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్బ్సి) పాల్గొనగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నంబర్–16 కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా రూ.20 లక్షల నగదు బహుమతితో కూడిన అవార్డును నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ, వార్డు నంబర్–16 కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు. సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లో గంగా ఆడిటోరియంలో జరిగిన స్వచ్ఛ వాయు దివస్–2026 కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ చైర్‌పర్సన్ రాజేష్ వర్మ, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ స్పెషల్ సెక్రటరీ సుశీల్ కుమార్ అవస్థి, అదనపు కార్యదర్శి ఆశుతోష్ అగ్నిహోత్రి, అదనపు కార్యదర్శి మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్‌పర్సన్ డా. అమందీప్ గార్గ్ తదితరులు హాజరయ్యారు. ఎన్ సి ఎ పి లో భాగంగా నిర్వహించిన సర్వేక్షణలో గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో అవగాహన వంటి అంశాలపై పట్టణ స్థాయిలో చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జంక్షన్ల అభివృద్ధి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్లాక్ ప్లాంటేషన్, ట్రాఫిక్ కారిడార్లలో పచ్చదనం పెంపు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జివిపి) రూపాంతరం, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎమ్ఆర్ఎఫ్) ప్లాంట్ వంటి చర్యలను చేపట్టింది. మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “ఈ జాతీయ స్థాయి అవార్డు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు గర్వకారణం. నల్గొండ ఎమ్మెల్యే రోడ్లు – భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహాయ సహకారాలతో నల్గొండ నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకువచ్చి, అన్ని డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పట్టణ సౌకర్యాలు కల్పిస్తూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ ను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్–1 కార్పొరేషన్‌ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం” అని మేయర్ తెలిపారు. కమిషనర్ బి. వంశీకృష్ణ మాట్లాడుతూ… “మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో నల్గొండ నగరానికి మరింత మెరుగైన పట్టణ మౌలిక వసతులు, ఆధునిక పౌర సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అందించే దిశగా చర్యలు కొనసాగిస్తాం. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నల్గొండ నిర్మాణానికి మరింత సమన్వయంతో పనిచేస్తాం” అని కమిషనర్ తెలిపారు. కేటగిరీ –3లో జాతీయ స్థాయిలో సాధించిన 2వ ర్యాంక్‌తో పాటు రూ.20 లక్షల నగదు బహుమతితో లభించిన ఈ అవార్డు నల్గొండ నగర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.