*సుతారిగూడలో ఘనంగా వినాయక ఉత్సవాలు*
*గణనాథుడిని దర్శించుకున్న గరిసెల సురేందర్ ముదిరాజ్ అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు*
గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 22: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సుతారిగూడలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుతారిగూడలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ సర్పంచ్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, యువతతో ఆయన మాట్లాడి ఉత్సవాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, సుతారిగూడలో ప్రతి ఏటా యువత ఐకమత్యంతో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తి, సేవా భావంతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. గణపతి ఆశీస్సులతో సుతారిగూడతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద భక్తులతో సందడి నెలకొంది.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
